కర్నాటకలో హంగ్.. కాంగ్రెస్ కే స్వల్ప ఆధిక్యం.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి

కర్ణాటకలో వచ్చే ఏప్రిల్‌/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ఫస్ట్  ట్రాకర్‌ పోల్‌ సర్వేలో వెల్లడయ్యింది. ఒక  వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌పల్స్‌  సిస్రో  తో కలిసి తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని సంపూర్ణ మెజారిటీ ఏ పార్టీ సాధించే అవకాశం లేదని తేలింది. అయితే అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది.  అయితే ఏ పార్టీ కూడా అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే అవకాశాలు లేవని కూడా పీపుల్స్ పల్స్ సర్వే లో వెల్లడైంది. 
పీపుల్స్‌పల్స్‌  మొదటి ట్రాకర్‌ పోల్‌ ను గత ఏడాది  డిసెంబర్  22 నుండి 31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన ఈ సర్వే వివరాలను సంస్థ గురువారం (జనవరి 5) విడుదల చేసింది.  ఎన్నికల లోపు మరో రెండు విడతల్లో రాష్ట్రంలో ఈ సర్వే చేయనున్నట్లు పేర్కొంది. 

కర్ణాటకలో గత మూడున్నర దశబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా రెండో సారి విజయం సాధించిన చరిత్ర లేదు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2022లో ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా పట్టు సాధించి, తిరిగి అధికారం నిలుపుకుంటామని బీజేపీ చెబుతోంది. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలయ్యి, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌, జేడి(ఎస్‌)లు ధీమాతో ఉన్నాయి.

పీపుల్స్‌ పల్స్‌-సిస్రో నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్‌/మైనస్‌ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్‌/మైనస్‌ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడి (ఎస్‌) 29 (ప్లస్‌/మైనస్‌ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113 ను ఏ పార్టీ సాధించలేదు.