ఆ వీరుల త్యాగాలే మన జాతికి అందిన గొప్ప ఫలాలు.....
posted on Jan 30, 2025 9:30AM

ఎక్కడ అణచివేతకి గురి కాబడతారో, అక్కడ.. ఆ అణచివేతని అంతం చేయటానికి వీరులు ఉద్భవిస్తారు. జాతి గౌరవం కోసం వారి ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు అన్నది మనకి చరిత్ర చెబుతున్న నిజం. వందల సంవత్సరాలు విదేశీయులు మన భరతమాత గుండెల మీద గుద్దుతుంటే రక్తం మరిగి ఎదురుతిరిగిన బిడ్డలెందరో పోరాడి అమరులయ్యారు. అలా మన దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ ప్రజల క్షేమం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మరవకూడదు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల త్యాగాలను గౌరవిస్తూ.. గుర్తుచేసుకుంటూ ముందు తరాలు కూడా త్యాగం విలువను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
అమరవీరుల దినోత్సవం..
భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో యువకులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు 1931లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలు నిర్వహించినందుకు ఉరిశిక్షకి గురయ్యారు. అప్పుడు వాళ్ళు బ్రిటీష్ వారికి లొంగిపోకుండా భారత జాతికి పోరాట స్ఫూర్తిని రగిలించి మరీ అమరులయ్యారు. వీరు ధైర్యం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారి, భవిష్యత్ తరాల కోసం ప్రేరణగా నిలిచారు. అందుకే వారు ఉరివేయబడ్డ ఆ దినమే అమరవీరుల దినంగా మన దేశం జరుపుకుంటోంది. అమరవీరుల దినోత్సవం చారిత్రాత్మకంగా ఎప్పుడు ప్రాముఖ్యత పొందిందంటే.. మనం జాతిపితగా పిలుచుకునే మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత 1948, జనవరి 30న హత్యకి గురి కాబడి అమరులయ్యారు. అప్పటినుంచి గాంధీగారు అహింసా విధానంలో భరతమాత కోసం చేసిన ఉద్యమాలు, త్యాగాలని స్మరించుకోవటానికిగానూ, అలాగే మన దేశం కోసం ప్రాణాలర్పించిన ఎంతోమంది వీరులని స్మరించుకోవటానికిగానూ ప్రతీ సంవత్సరం జనవరి 30న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాము.
మహాత్మా గాంధీ ..
మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అహింసా, సత్యాగ్రహాలను ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. 1915లో దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తరువాత ఖేదా, చంపారన్ ఉద్యమాలు నడిపి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1930లో దండీ ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడిపారు. గాంధీజీ శాంతి, సమానత్వం, సామరస్యానికి మార్గదర్శకుడిగా నిలిచారు. గాంధీజీ యొక్క అహింసా, సివిల్ నిరసన తత్త్వాలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాయి. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన "జాతిపిత", "బాపూజీ" గా ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా అహింస, శాంతికి ప్రతీకగా నిలిచారు.
భారత స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవటం కోసం, వారు దేశం పట్ల చూపిన దేశభక్తి, ధైర్యం, వారు చూపిన అంకిత భావం, దేశానికి దేశ స్వేచ్ఛకు ఇచ్చిన విలువలను గుర్తు చేసుకునే సందర్భంగా ఈ రోజు నిలుస్తుంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమర వీరులకు దేశం నివాళులు అర్పించేది ఈరోజే. ఈ దినోత్సవం జాతీయ ఐక్యతకు పిలుపునిస్తుంది. ఇది ప్రజలను ఒకతాటిపైకి తెచ్చి, పోరాటాల చరిత్రను గౌరవించేలా చేస్తుంది. అమర వీరుల కథలు భవిష్యత్తు తరాలకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను కాపాడేందుకు ప్రేరణగా నిలుస్తాయి.
దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తారు. సంస్మరణ కార్యక్రమాలు, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటారు. వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తారు.
పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అసెంబ్లీలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాటకాలు, కవితలు, ప్రసంగాలు ద్వారా అమర వీరుల జీవితాలను గుర్తుచేసుకుంటారు. సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు. మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కలిగించే కధనాలు, చిత్రాలను ప్రసారం చేస్తారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అమర వీరులకు ఘనంగా నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమాలు సమాజంలో బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించడానికి ప్రేరణగా నిలుస్తాయి. దేశం భవిష్యత్తు, దేశ రక్షణ, దేశ అభివృద్ది ప్రతి పౌరుడి బాధ్యత అనే విషయాన్ని కూడా ఈరోజు అందరికీ గుర్తు చేస్తుంది.
*రూపశ్రీ