కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఈ నియమాలు పాటించండి..!

 

ఈ సమాజంలో ప్రతి వ్యక్తిగత బలాలు, బలహీనతలు ఎన్ని ఉన్నా.. లేకపోయినా కుటుంబం అనే అతి పెద్ద ధైర్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది.  ఒక దశ వరకు కుటుంబం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  తల్లిదండ్రులు, పిల్లలు.. వారి పిల్లలు ఇలా అందరూ కలిస్తే కుటుంబం అవుతుంది. ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని ప్రతి ఇంటి పెద్ద కోరుకుంటాడు.  ముఖ్యంగా ఇంటి సభ్యులు  అన్యోన్యంగా ఉంటూ.. ఇల్లు ప్రశాంతంగా సంతోషాలతో ఉంటే ఆ ఇల్లు నందనవనంలా అనిపిస్తుంది.  ఇంటి వాతావరణం బాగుంటే కుటుంబ సభ్యులు బయటి వ్యక్తుల ప్రభావంలో అస్సలు పడరు కూడా.  కానీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండటం లేదు  ఈ కాలంలో.. చీటికి మాటికి గొడవలు, అపార్థాలు, ఒకరిని ఒకరు నిందించుకోవడాలు వంటివి ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు చిన్నతనంలో ఉండగానే కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది.  ఇంతకీ  ఆ నియమాలు ఏంటో తెలుసుకుంటే..

సమయం కావాలి..

కుటుంబ సభ్యుల మధ్య మంచి వాతావారణం,  బలమైన  బంధాలు ఏర్పాడాలంటే ఒకరికి మరొకరు సమయం కేటాయిస్తూ ఉండాలి. దురదృష్టవశాత్తు ఇప్పటి కాలంలో ఇలా సమయం కేటాయించడం సమయం దొరకడం కష్టం అవుతోంది.  అందుకే సమయం కేటాయించుకోవాలి. కనీసం కలిసి తినడం,  రోజులో ఏదో ఒక సమయంలో కలిసి మాట్లాడటం,  ఏదైనా సరదాగా ఆడటం,  సమయం గడపడం.. ఇలా ఏదో ఒక విధంగా కుటుంబ సభ్యులు అందరూ కనెక్ట్ అయ్యి ఉండాలి.

మాట్లాడటమే కాదు.. వినాలి..

మాట్లాడటం అందరూ చేస్తారు. తమ అభిప్రాయాలు, ఆలోచనలు,  నిర్ణయాలు అందరికీ చెప్పడమే కాదు.. కుటుంబ సభ్యులు చెప్పే విషయాలు కూడా వినాలి.  కుటుంబ సభ్యుల స్పందన, వారి ఆలోచనలు,  అభిప్రాయాలు అన్నీ వినాలి.  దాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం కూడా బాగా బలంగా మారుతుంది.

సాయానికి సిద్దంగా ఉండాలి..

కుటుంబ సభ్యుల ఐక్యతను నిలబెట్టేవి కష్ట సమయాలే.. ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి,  ఒకరికొకరు తోడు ఉండటానికి సిద్దంగా ఉండాలి. ఇలా ఉంటే తమ వెనుక కుటుంబ బలం ఉందనే ధైర్యంతో ఉంటారు. ఇది కుటుంబ సభ్యులను ఎప్పటికీ కలిపి ఉంచుతుంది.

వేడుకలు..

వేడుకలు కుటుంబ సభ్యులను కలిపి ఉంచడం కోసం, వారు సంతోషంగా సమయాన్ని గడపడం కోసం ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది.  సందర్భం ఏదైనా వేడుక ఎంత చిన్నది అయినా కుటుంబ సభ్యులు అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకుంటే అది వారికి చాలా స్పెషల్ గా మారుతుంది.

మెప్పు..

కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒకరిని మరొకరు విమర్శించుకోకూడదు.  ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ ఉండాలి.  ఎవరు మంచి పని చేసినా,  ఎవరు కుటుంబానికి సంతోషం కలిగించే పని చేసినా,  వ్యక్తిగతంగా అభివృద్ది చెందుతున్నా, బాగా చదువుతున్నా.. మంచి పేరు తెచ్చుకుంటున్నా.. ఇలా ప్రతి విషయాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఆ కుటుంబంలో పిల్లల భవిష్యత్తు చాలా గొప్పగా మారుతుంది.

                          *రూపశ్రీ.