జీవవైవిధ్య పరిరక్షణకు అందరు కృషి చేయాలి: ప్రధాని
posted on Oct 16, 2012 4:51PM

ప్రధాన మంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు మంత్రులు, ఇంకా డి.జి.పి. కూడా విమానాశ్ర యంలో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని జీవ వైవిధ్య సదస్సుకు హాజరు కావడానికి అధికారులు ముందుగానే హెలికాప్టర్‌ను, కాన్వాయ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నేరుగా హెచ్‌ఐసిసి సదస్సుకు వెళ్లారు. జీవ వైవిధ్య ప్రాధాన్యతను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని చెప్పారు. పర్యావరణ ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన క్రమంగా ఏర్పడుతోందన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణకు అందరూ కృషి చేయాలని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఇందు కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉద్యమించాలన్నారు. జీవ వైవిధ్యంపై పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2010 లక్ష్యాలను చేరుకోలేక పోయామన్నారు. ప్రకృతి నుండి కనుమరుగు అవుతున్న జంతువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పర్యావరణమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వన్యప్రాణుల రక్షణ కోసం చట్టాలని కఠినతరం చేశామని చెప్పారు. సాంప్రదాయ పంటలను కాపాడుకోవాలన్నారు. ఆహార భద్రత ప్రపంచానికి పెను సవాల్‌గా మారిందన్నారు.