సోషల్ మీడియాలో ఎర.. సంపాదన కోటిన్నర..!!

పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు.. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత చేటు అని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంది.. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. మాయమాటలు చెప్పి మనస్సు, మనీ దోచుకొని మోసం చేస్తున్నారు.. తాజాగా అలాంటి కేటుగాడే దొరికాడు.

 

 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్‌ హర్ష.. 2009లో కాకినాడ సమీపంలోని ఓ కళాశాలలో బీటెక్‌ లో చేరి మధ్యలోనే ఆపేశాడు.. 2014లో హైదరాబాద్‌ వెళ్లి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశాడు.. వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించాడు.. ఉద్యోగం మానేసి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లే వేదికగా హైదరాబాద్‌లో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే యువతులకు గాలం వేశాడు.. యానాం ప్రాంతానికి చెందిన ఓ అందమైన యువకుడి ఫోటోను తన ప్రొఫైల్‌ ఫొటోగా వాడుకున్నాడు..  కాకినాడకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు, అతడి భార్యని తన తల్లిదండ్రులుగా చెప్పేవాడు.. ఇతని మాటల వలలో ఐదు వందల మంది వరకూ అమ్మాయిలు, మహిళలు పడిపోయారు.. ఇతగాడి వలలో పడ్డవారిలో మధ్యతరగతి, ధనవంతుల పిల్లలే కాదు ఎంపీలు, మంత్రుల పిల్లలు బంధువులూ ఉన్నారు.. మాయమాటలతో రెండున్నరేళ్లలో సుమారు కోటిన్నర వరకు వెనకేసుకున్నాడు.. దొరక్కపోయుంటే ఇంకెన్ని కోట్లు వెనకకేసునేవాడో!!.

 

 

ఇంతకీ ఇతను ఎలా దొరికాడంటే.. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.70 వేల డబ్బు, ఐదున్నర కాసుల బంగారు ఆభరణాలను తీసుకొని ఉడాయించాడు.. ఆమె గత మార్చిలో కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. సీఐ ఉమర్‌, ఏఎస్‌ఐ పట్టాభి ఆధ్వర్యంలోని బృందాలు నిందితుడి జాడపై జల్లెడపట్టాయి.. కానిస్టేబుల్‌ నూకరాజు హైదరాబాద్‌లో దాదాపు 20 రోజులపాటు తిరిగి చివరికి నిందితుడి జాడను గుర్తించారు.. మంగళవారం ఉదయం నిందితుడు వంశీకృష్ణని కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవివర్మ వివరించారు.. అయితే ఇతని మీద ఇప్పటికే పలు స్టేషన్లలో 15 కు పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.. అంతేకాదు గతంలో జైలుకి కూడా వెళ్ళొచ్చాడు.. ఇలాంటి సంఘటనలు చూసిన తరువాత అయినా సోషల్ మీడియాలో అపరిచితులు చెప్పే మాయమాటల వలలో పడకుండా జాగ్రత్త పడాలి.