గుట్కా స్కామ్.. మంత్రి, డీజీపీ ఇంట్లో సీబీఐ సోదాలు..!!

 

కొన్ని నెలల క్రితం గుట్కా స్కామ్ తమిళనాడులో సంచలనం రేపింది.. గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఓ వ్యాపారికి సంబంధించిన ఆస్తులపై దాడులు చేయగా వారికి ఓ డైరీ లభించింది.. అందులో లంచాలు ఇచ్చిన వారి జాబితాలో పలువురు రాజకీయ నాయకులు, సీనియర్‌ పోలీసు అధికారుల పేర్లు ఉన్నాయి.  నిషేధిత గుట్కా వ్యాపారం చేసుకునేందుకు అనుమతించినందుకు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్‌, నాటి చెన్నై పోలీస్ కమిషనర్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రన్‌కు భారీగా ముడుపులు అందాయన్న ప్రచారం జరిగింది.. దీనిపై డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో కేసు దర్యాప్తును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది.. ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.. కోట్ల రూపాయల విలువైన చెన్నై గుట్కా కుంభకోణంతో సంబంధం ఉందనే అనుమానంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సి.విజయ భాస్కర్‌, డీజీపీ టీకే రాజేంద్రన్‌ సహా మరికొందరు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.