బీఆర్ఎస్ ఎన్నికల ఎత్తుగడ... హైదరాబాద్ యూటీ బూచి?

హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి  కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరి కొన్నాళ్లు కొనసాగించాలని  తెలుగుదేశంనాయకుడు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు  తాజాగా ఆరోపించారు.ఇవి తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని తెలంగాణను కాపాడుకోవాలంటో లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఓట్లేయాలని పిలుపునచ్చారు. తెలంగాణ అస్థిత్వం కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే తగిన ఎంపీ స్థానాలు అవసరమని కేటీఆర్,హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.  

జూన్ 1వతేదీతో 10ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బీఆర్ఎస్ వినా ఎవరూ ఉమ్మడి రాజధాని గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. అధికారానికి దూరమైన బీఆర్ఎస్ కు, ఈ నెలలో జరిగే ఎన్నికలలో ఓటమి భయంతో వణికి పోతున్న జగన్ పార్టీకీ మాత్రమే ఉమ్మడి రాజధాని గుర్తుకు వచ్చింది. వాస్తవానికి ఏపీలో జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఈ ఐదేళ్లలో  హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయమే ఆయనక గుర్తులేదు. ఇప్పుడు ఎన్నికల ముంగిట ఓటమి భయం వెంటాడుతుంటే.. ఆయన ఉమ్మడి రాజధానిని వదిలేసి వచ్చి చంద్రబాబు తప్పు చేశారంటూ విమర్శలు ఎత్తుకున్నారు.

వాస్తవానికి  చంద్రబాబు హయాం లోనే ఏపీకి సంబంధించిన కార్యాలయాలన్నీ దాదాపుగా ఏపీకి తరలి వచ్చాయి. మిగిలిన కార్యాలయాలు కూడా జగన్ అధికారం చేపట్టిన తరువాత ఏపీకి తరలివచ్చాయి. 
జూన్ 1వ తేదీ తరువాత హైదరాబాద్ కేంద్రం చేతిలోకి వెళుతుందన్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లు తెలంగాణలో ఎన్నికల హీట్ పెంచాలనీ, ఐటీ బూచిని చూపి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందాలనీ చూస్తున్నారు.   బీజేపీ నుంచి హైదరాబాద్ యూటీ అన్న ప్రతిపాదన ఏదీ రాకుండానే బీఆర్ఎస్ కీలక నేతలు ఎందుకు ఆ అంశాన్ని లేవనెత్తారన్నది బహిరంగ రహస్యమే. తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటే తమను లోక్ సభ ఎన్నికలలో జీరో స్థానాల పరాభవం నుంచి గట్టెక్కగలదని బీఆర్ఎస్ భావిస్తుండటమే యూటీ బూచిన ఎన్నికల అంశంగా మార్చాలని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు కారణం.  

తెలంగాణ ఉద్యమం సమయంలో, రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ యూటీ ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. అప్పట్లో ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రజలు ,నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన అప్పట్లోనే అటకెక్కింది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ యూటీ ప్రతిపాదనకు అప్పట్లో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.  ఆ తరువాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను నిర్ణయించినా, దానిని ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఉత్తరాది,దక్షిణాది అంశాలు   తెరపైకి వచ్చిన నేపథ్యంలో కొంత కాలం కిందట హైదరాబాద్ ను ఢిల్లీ తరువాత దేశానికి రెండవ రాజధానిగా మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. శీతాకాలపార్లమెంటు సమావేశాలు  దక్షిణాదిలో హైదరాబాద్ లో జరపాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే.  రాజ్యాంగంలో కూడా  రెండవ రాజధాని ప్రస్తావన ఉందని కొందరు చెబుతున్నారు కూడా.

మొత్తం మీద తెలంగాణలో కనీస స్థానాలను దక్కించుకుని పరువు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ రాష్ట్రాల మధ్య సెంటిమెంటు మంటలు రగల్చడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అయితే సెంటిమెంట్ రగిల్చేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలైతే ఇసుమంతైనా కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా బీజేపీ మద్దతు పొందాలన్న తహతహ బీఆర్ఎస్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ బీజేపీకి గెలుపు అవకాశాలున్న ఐదు నియోజకవర్గాల గురించి పట్టించుకోవడం లేదనీ, తన ప్రచారంలో కేవలం 12 స్థానాల్లో విజయం అనే అంటున్నారని చెబు తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో  పెను మార్పులు అంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారీ ఒప్పందానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలలో జీరో కాకూడదని బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కపపడానికీ, తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికీ కూడా వెనుకాడటం లేదని అంటున్నారు.