జనం చెవిలో రేవంత్ రెడ్డి పూలు!

రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు పెట్టిన పూలే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నారు. ఎందుకంటే, ఆ పూలు పెట్టక తప్పని పరిస్థితి. విభజన చట్టం ప్రకారం పోలవరం పరిసరాల్లోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యాయి. 2014లో ఈ విలీనం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రక్రియకు మద్దతు పలికారు. అది జరగక తప్పని అంశం అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ మాట మార్చారు. ఆంధ్రాలో కలసిన గ్రామాలను తిరిగి తెలంగాణకు తెస్తాం అని చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చి పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ అండ్ కంపెనీ విలీన గ్రామాలు అనే పాయింట్‌ని పట్టుకుని మొన్నటి వరకూ వేలాడింది. ఇప్పుడు అదే పాయింట్‌ని పట్టుకుని రేవంత్ రెడ్డి వేలాడ్డం ప్రారంభించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రీసెంట్‌గా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఈ హామీ చేశారు. ఏపీలో విలీనం అయిన గ్రామాలను వెనక్కి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన 1. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, 2. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, 3. హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), 4. హైదరాబాద్-విజయవాడ రహదారి వెంటే వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు, 6. మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు... ఇవన్నీ సాధిస్తామని రాసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సినవి ఇవ్వాల్సిందే అని అడగడంలో న్యాయం వుంది. కాకపోతే అదే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే కదా... తెలంగాణలోని గ్రామాలను ఆంధ్ర్రపదేశ్‌లో కలిపింది. మాకు రావలసినవి అడుగుతాం.. ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వం అనే సిద్ధాంతం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. పైగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. 

కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే జనాన్ని మభ్యపెట్టడానికి గ్రామాలను తిరిగి తెచ్చే హామీ ఇస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవాలని అనుకుంటే ఆయన ఇష్టం. ఎవరు కాదంటారు?