జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీ రాయ్ వరకు

ప్రమదావనంతో పాఠకులకు చేరువై

 

మరణించిన తర్వాత శరీరదానంతో స్పూర్తి నింపిన రచయిత

 

మాలతీ చందూర్ (1930 - ఆగష్టు 21, 2013)

 

మహిళల జీవితంలో వంటింటి నుంచి ఉద్యోగనిర్వాహణ వరకు ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సూచనలు ఆమె శీర్షిక ద్వారా లభించేవి. అందుకే ఆమె శీర్షికలు రెండు దశాబ్దాలకు పైగా పాఠకులను అలరించాయి. ఆమె రాసే "జవాబులు" శీర్షిక పేజీలను పుస్తకాలుగా బైండింగ్ చేసి చాలామంది దాచుకునేవారు. ఆమే ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత మాలతీచందూర్.

 

మూడు దశబ్దాలకు పైగా సాహిత్యరంగంలో రాణించిన ఆమె ప్రముఖ రచయిత జేన్ ఆస్టిన్ నుంచి అరుంధతీరాయ్ వరకు ఎందరో రచయితలు రాసిన  రచనలను తెలుగులోకి అనువాదం చేశారు. వాటిలో చాలా రచనలు స్వాతి మాసపత్రికలో  'పాత కెరటాలు'గా ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా ఇతివృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు. కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసే సమయంలో తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక తమిళ రచనలను తెలుగులోకి అనువాదం చేశారు.

 

మాలతీ చందూర్  1930లో కృష్ణా జిల్లా లోని నూజివీడులో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. ఆమెకు ఆరుగురు అన్నలు. నూజివీడులోనే ఎనిమిదవ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏలూరులో వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అక్కడే చందూర్,  డి.కామేశ్వరి, సి. ఆనందారామం తదితరులతో పరిచయం ఏర్పడింది. ఏలూరులో ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దేవుల పల్లి కృష్టశాస్త్రీ, నండూరి సుబ్బారావు, వెంకటచలం తదితరులు వచ్చేవారట. వారందిరినీ చూడటం, వారి మాటలు వినడంతో ఆమెకు సాహిత్యరంగంపై ఆసక్తి పెరిగింది. 1947లో ఆమె, చందూర్‌ కలిసి చెన్నై వెళ్ళి పెండ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్రైవేటుగా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. 1949లో రచనలు చేయడం ప్రారంభించారు. రేడియో లో  తన  రచనలను చదివి వినిపించేవారు. ఆ తర్వాత 1950 నుంచి సాహిత్యంలో రాణించారు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 'నన్ను అడగండి' అంటూ మహిళల కోసం "ప్రమదావనం"  శీర్షికలను  దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రాశారు. వంటలు, సరదా విషయాలతో పాటు మహిళలకు ఆంగ్ల సాహిత్యాన్ని కూడా పరిచయం చేశారు. విదేశాలకు వెళ్ళివచ్చిన వారి అనుభవాలు కూడా రాయించేవారు. ఆమె నిర్వహించే జావాబులు శీర్షిక ఎంతో పాఠకాధరణ పొందింది. పాతిక దాకా మహిళా ప్రధాన ఇతివృత్తాల్లో నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీ రాయ్  వరకూ అనేక మంది ప్రముఖ రచయితల రచనలను ఆమె తెలుగులోకి అనువాదం చేశారు.  ఇవి  స్వాతి మాసపత్రికలో 'పాత కెరటాలు' శీర్షికన ప్రచురించారు.

 

నవలా రచయితగా, మహిళా సంబంధిత అంశాలను ప్రస్తావిస్తూ కాలమిస్టుగా అనేక రచనలు చేశారు. మహిళలు ఎదుర్కోంటున్న ఎన్నో సమస్యలకు ఆమె రచనలు పరిష్కారం సూచించేవి. మహిళల్లో ఆలోచన శక్తి, సమస్యను ఎదుర్కోనే యుక్తి పెంచేలా ఆమె రచనలు ఉండేవి. 17కు పైగా నవలలు రాసిన ఆమె కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు. 21 ఆగస్టు, 2013న చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. మరణానంతరం ఆమె శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.