రాజ్‌భవన్ కింద పురాతన సొరంగం...

 

మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ కింద సొరంగాన్ని గుర్తించారు. రాజ్‌భవన్ పరిసరాల్లో ఓ భారీ బంకర్ ఉందని కొందరు పెద్ద వారు ఇచ్చిన సమాచారం మేరకు గవర్నర్ విద్యాసాగర్‌రావు దీనిని గుర్తించారు. ఈ క్రమంలో ఆయన కాసేపు పురాతత్వ శాస్త్రవేత్త అవతారమెత్తారు. రాజ్‌భవన్‌లో బంకర్ ఉన్న చోటుకి స్వయంగా వెళ్లి..సిబ్బందితో దాన్ని వెలికి తీయించారు. లోపలికి వెళ్లకుండా గోడ అడ్డువుండటంతో ..దానిని పగలకొట్టించారు. 150 మీటర్ల పొడవు..3 మీటర్ల వెడల్పుతో బ్రిటీష్ కాలం నాటి బంకర్ బయటపడింది. దీనికి రెండు వైపులా 20 అడుగుల ఎత్తయిన తలుపులు ఉన్నాయి.

దీంతోపాటు దీనికి ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ, లోపలికి వెళుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీనికి తూర్పువైపు ఉన్న ద్వారాన్ని మూసి పశ్చిమ ద్వారం తెరిచారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీనిని మూసివేసినప్పటికి దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా ఉండటం ఆశ్చర్యం. దీనిలో షెల్ స్టోర్, గన్ షెల్, క్యాట్రిడ్జ్ షోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్‌షాప్ మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గవర్నర్ విద్యాసాగర్‌రావు బంకర్‌ను సందర్శించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రత్యేక పురావస్తు అధికారులకు చెప్పి దాని సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు.