సౌదీ యువరాజుని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు
posted on Sep 26, 2015 12:07PM
అమెరికాలోని లాస్ ఏంజిలెస్ నగరంలో బెవేర్లీ హిల్స్ లో ఉంటున్న సౌదీ యువరాజు మజేడ్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్ (28) ని లైంగిక వేధింపులకి పాల్పడినందుకు బుదవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక మహిళపై అతను లైంగిక వేధింపులకి పాల్పడగా ఆమె తప్పించుకొని ఆయన ఉంటున్న భవనం చుట్టూ ఉన్న 8అడుగుల గోడపై నుండి దూకి తప్పించుకొంది. ఆ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నట్లు తాను గమనించాని పొరుగునే ఉన్న టెన్నిసన్ కొల్లిన్స్ అనే వ్యక్తి తెలిపాడు. ఈ సంగతి తెలిసిన పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని సౌదీ యువరాజుని అరెస్ట్ చేసారు. కానీ $ 300, 000 డాలర్లు సెక్యూరిటీగా చెల్లించడంతో సౌదీ యువరాజును బెయిల్ పై విడుదల చేసామని లాస్ ఏంజిలెస్ పోలీస్ ఉన్నతాధికారి డ్రేక్ మేడిసన్ మీడియాకి తెలియజేసారు. సౌదీ యువరాజుకి దౌత్యపరంగా ఎటువంటి రక్షణ కవచం లేదని దృవీకరించుకొన్న తరువాతనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ భవనంలో పనిచేస్తున్న సుమారు 20 మందిని పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సౌదీ యువరాజు చాలా హేయమయిన నేరానికి పాల్పడి అరెస్ట్ అవడంతో ఆదేశ, రాజవంశ ప్రతిష్టకు మాయని మచ్చ తెచ్చారు.
ఈ సంఘటన అగ్ర రాజ్యమయిన అమెరికాలో జరిగింది కనుక అతను సౌదీ యువరాజు అయినప్పటికీ పోలీసులు అతనిని దైర్యంగా అరెస్ట్ చేయగలిగారు. కానీ కొన్ని రోజుల క్రితం డిల్లీలో (సమీపంలో గుర్ గావ్ పట్టణంలో) ఒక సౌదీ దౌత్యవేత్త ఇద్దరు నేపాలీ పనిమనుషులను రెండు మూడు నెలలపాటు ఏకధాటిగా అత్యాచారం చేయడమే కాకుండా తన స్నేహితుల చేత కూడా వారిపై అత్యాచారం చేయించినట్లు కనుగొన్నప్పటికీ డిల్లీ పోలీసులు అతనిని అరెస్ట్ చేయలేకపోయారు. తనకున్న దౌత్యపరమయిన రక్షణ కవచం ఉపయోగించుకొని అతను సౌదీ పారిపోయాడు. అతను పారిపోతున్నాడని తెలిసినప్పటికీ భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అతను క్షేమంగా స్వదేశం చేరుకొన్న తరువాత అతనిని తమకి అప్పగించమని సౌదీ ప్రభుత్వాన్ని ప్రాదేయపడుతోంది.