నిర్ణయాలు నవ్వుతాయి జాగ్రత్త!

అంతా నువ్వే చేసావు. అప్పుడలా చేయకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అన్నిటికి కారణం మీరే. ఇప్పుడు జీవితంలో సొల్యూషన్ ఏంటి?? జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరు భరించేవాళ్ళు?? మీకేం హాయిగానే ఉంటారు, భరిస్తున్న వాళ్లకు తెలుస్తుంది అందులో ఉన్న బాధ.

ఇలాంటి మాటలు చాలా మంది తమ జీవితాల్లో మాట్లాడుతూ ఉంటారు. వీటికి కారణం ఏమిటంటే ముఖ్యమైన నిర్ణయాలు స్వంతంగా తీసుకోలేక ఇతరుల ఒత్తిడితోనో, లేక నిస్సహాయతలోనో ఉన్నప్పుడు జరిగిపోవడం. సింఫుల్ గా చెప్పాలి అంటే జీవితాన్ని, అందులో ముఖ్యమైన విషయాలను ఇతరులు నిర్ణయించడం. 

ఎందుకిలా??

జీవితాల్లో ఇలా ఎందుకు జరుగుతాయి. సాధారణంగా చాలామంది చెప్పుకునే సమర్థింపు కారణం ఒకటి ఉంటుంది. అదేంటంటే అలా రాసిపెట్టి ఉంది. దానికి ఎవరేం చేయగలరు అని. అదే సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదైనా అటు ఇటు అయితే అందరూ అలాగే అనుకోగలరా?? లేదే ముందే చెప్పాము కానీ వినలేదు. అందుకే ఇలా అవుతోంది. కావాల్సిందేలే. శాస్తి జరగాల్సిందే లాంటి మాటలు వినబడుతుంటాయి. 

అయితే వాటి గురించి పక్కనబెడితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. అదే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి అని. 

అంతిమ నిర్ణయం!!

ఎవరు ఎన్ని సలహాలు అయినా ఇవ్వచ్చు, ఎన్నో సలహాలు అయినా తీసుకోవచ్చు. కానీ చివరికి సాధ్యా సాధ్యాలు ఆలోచించి నష్టాలు జరిగితే భరించాల్సింది నేనే కదా అనే అవగాహనతో ఉండాలి. అపుడే ఏదైనా నిర్ణయం తీసుకోగలరు. 

ఇచ్చేయ్యాలి!!

ఎవరి జీవితంలో వాళ్ళు తమ సామర్త్యాలకు తగినట్టు ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉంటారు. ఒక మెడికో దగ్గరకు వెళ్లి పోలీస్ అకాడమీ కి సంబంధించిన విషయాలు చెప్పమంటే ఎలా అయితే అవగాహన లేకుండా ఉంటారో ఇదీ అంతే. 

ఇంకొక విషయం ఏమిటంటే పెద్దరికం అనే ఆయుధం చేతిలో ఉంది కదా అని ఊరికే చిన్న వాళ్ళ జీవితాలను డిసైడ్ చేయకూడదు.  కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వాలి. అలాగని వాళ్ళ జీవితాలను ఏదో వీధుల్లో వదిలేయడం లేదు కదా. పెద్దరికం అంటే తప్పు మార్గం లో వెళ్తున్నప్పుడు రంగంలోకి దిగి సరిచెయ్యడం, చెప్పాల్సిన రీతిలో చెప్పడమే కానీ జీవితాలను లాక్కోవడం కాదు.

బి కాన్ఫిడెంట్!!

కాన్ఫిడెంట్ అనేది నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఉంది అని నోటితో చెబితే వచ్చేది కాదు. నలుగురితో చెబితే బుర్రలో చేరేది అంతకన్నా కాదు. అనుభవాలు, పరిస్థితులను మేనేజ్ చేయడంతో ఆ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ప్రణాళిక, లక్ష్యాలు చేరడం అనేవి చాలా ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ధైర్యం ఉండాలి ఎందుకంటే జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న తరువాత వాటి నష్టాలు ఏమైనా ఎదురైనా తిరిగి భర్తీ చేసుకోవడం చాలా కష్టం.

అతి విశ్వాసం వద్దు!!

కొందరు చెప్పేవాటిలో  మంచి విషయాలే ఉండచ్చు.  అయితే వాళ్ళ వరకు మాత్రమే అది మంచిగా ఉండచ్చు. కానీ ఇతరులకు అలా ఉంటుందో లేదో ఎవరికి తెలుసు. అలాంటప్పుడు నాకేదో బాగుంది మీకూ బాగుంటుందిలే carry on అని అదేపనిగా ముందుకు ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు. 

ఇదే నిజం!!

పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు,ఉద్యోగాలు కావచ్చు జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉండచ్చు. ప్రతి నిర్ణయంలో అంతిమంగా తృప్తి అనేది ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ పని చేసాక ఏదైనా నష్టం జరిగినా నేను దాన్ని భరించగలను అనే ఆలోచన కూడా ఉండాలి. ఫెయిల్యూర్ ను ఆక్సిప్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయగలిగే మనస్తత్వం ఉండాలి. అలా ఉంటే జీవితాలు బాగుంటాయి. లేకపోతే గడ్డి తినమన్నారు కాబట్టి తిన్నాము ఇప్పుడు అరగలేదు అంటే దానికి ఎవరు బాద్యులు?? ఎంత అనుభావాలు కలిగిన  వాళ్ళు అయినా అవి వాళ్ళ వరకు మాత్రమే 100% వర్తిస్తాయి. 

అందుకే నిర్ణయాలు నవ్వుతాయి. జాగ్రత్తగా ఒకరి ప్రమేయం లేకుండా వాటిని తీసుకోవాలి.

◆ వెంకటేష్ పువ్వాడ.