పొగడ్తలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?

పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు. 

ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం.

ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు.

అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు.


సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది.

ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు.

ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.

                                   ◆నిశ్శబ్ద.