లగడపాటి కౌంటర్ వాదనలు
posted on Jul 6, 2011 9:23AM
న్యూఢిల్లీ: కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు కలిసి వెళ్లిన వెంటనే మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల వాదనలకు కౌంటర్ వినిపించడానికే లగడపాటి రాజగోపాల్ ప్రణబ్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాజీనామాలకు లొంగవద్దని లగడపాటి ప్రణబ్ కు సూచించినట్లు సమాచారం. ఒకవేళ తెలంగాణ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు హై కమాండ్ తలోగ్గితే డిసెంబర్ 9 మళ్ళీ రిపీట్ అవుతుందని లగడపాటి హెచ్చరించారు. సీమాంధ్రనాయకులు కూడా రాజీనామాలు చేస్తారన్నారు. మరోవైపు, తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాల నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా కాంగ్రెసు అధిష్టానం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నది. మంగళవారమంతా తెలంగాణ ప్రజాప్రతినిధులతో గులాం నబీ ఆజాద్, ఆహ్మద్ పటేల్ సమావేశం కాగా, రాత్రి ప్రణబ్ ముఖర్జీ సీన్‌లోకి వచ్చారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు దిగి రావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడానికి నిర్దిష్టమైన గడువు ఇవ్వాలని తెలంగాణ నేతలు చెబుతున్నారు.