ఇన్నాళ్లకు రాజమౌళిని భయపెట్టే డైరెక్టర్ వచ్చాడు!

ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరంటే ముక్తకంఠంతో అందరూ చెప్పే పేరు దర్శధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా, దర్శకుడిగా గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అలాంటి రాజమౌళికి ధీటైన దర్శకుడు ఎవరంటే.. ఎవరో ఒకరి పేరు బలంగా చెప్పలేము. అయితే అదంతా నిన్నటి వరకే. ఇప్పుడు లెక్క మారింది. రాజమౌళికి సవాల్ విసిరే దర్శకుడు వచ్చాడు.

ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ వైడ్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పేరు మారుమోగిపోతోంది. ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) చిత్రం తాజాగా థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే అదిరిపోయే పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలాంటి కథతో సినిమా రాలేదని, విజువల్ వండర్ అని, హాలీవుడ్ సినిమాలను తలపించేలా కల్కి ఉందని అంటున్నారు. మైథలాజికల్ టచ్ తో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా 'కల్కి'ని మలిచిన దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ గొప్పగా ఉందని.. కొన్ని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే రాజమౌళిని సవాల్ చేసే అసలుసిసలైన డైరెక్టర్ వచ్చాడనే అభిప్రాయం కలుగుతోందని చెబుతున్నారు. మొత్తానికి 'కల్కి' సినిమాకి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే.. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి-2' స్థాయి వసూళ్లు వస్తాయి అనిపిస్తోంది. అదే జరిగితే, రాజమౌళి తన తదుపరి సినిమా 'SSMB 29' కోసం మరింత కసిగా పని చేసి.. కంటెంట్ పరంగా, కలెక్షన్ల పరంగా కొత్త టార్గెట్లను సెట్ చేయాల్సి ఉంటుంది.