'కల్కి' బాక్సాఫీస్ ఊచకోత.. వెయ్యి కోట్ల దిశగా పరుగులు!

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

'కల్కి' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రకటించిన మేకర్స్.. రెండు రోజుల్లో రూ.298.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుపుతూ తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు. అంటే ఈ సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా రూ.107 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందన్నమాట. మూడు రోజు, నాలుగో రోజు వీకెండ్(శని,ఆది) కావడంతో.. ఈ రెండు రోజుల్లో మరో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబడుతుంది అనడంలో సందేహం లేదు. అంటే ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశముంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉండగా.. ప్రస్తుత జోరు చూస్తుంటే రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.