చంద్రబాబుపై కేటీఆర్ సానుభూతి మొసలి కన్నీరేనా?!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నేడో రేపో అయనను ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కోసం ఆసుపత్రిలో స్పెషల్ వీఐపీ వార్డ్ కూడా సిద్దమైనట్లు తెలుస్తున్నది. మరో వైపు జైల్లో కూడా తక్షణమే ఆయన ఉండే బ్యారక్ కు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. కాగా, ఆయన ఆరోగ్యంపై ఇప్పుడు తెలుగుదేశం నేతలతో పాటు మిగతా పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణ నేతలు కూడా చంద్రబాబు ఆరోగ్యంపై కలవరపాటుకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ నుండి పలువురు నేతలు చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించగా.. మంత్రి కేటీఆర్ స్పందన మాత్రం వివాదాస్పదంగా మారుతుంది.

 చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అయన కుమారుడు నారా లోకేష్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులో తీవ్రమైన ఎండవేడిమితో ఆయన అస్వస్థతకు గురికాగా.. స్కిన్ అలర్జీ కూడా తలెత్తి ఆయన పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్.. జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే వైఎస్ జగన్‌దే బాధ్యతన్న లోకేష్.. చంద్రబాబుపై దురుద్దేశంతో కుట్రలు పన్నారన్నారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. జైలులో దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్, అలర్జీతో బాధపడుతున్నారని లోకేష్ ట్వీట్ చేశారు.

లోకేష్ ట్వీట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. “చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్‌ ట్వీట్ నాకు చాలా బాధ కలిగించింది. ఓ కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్‌ ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో నేనూ ఇలాగే నా తండ్రి ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన చెందాను,”అని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక సైకో కోసం తెలంగాణలో పోలీసులు ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేసిన వారేనని గుర్తు చేశారు, వివిధ దేశాల్లో చంద్రబాబు కోసం సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కానీ హైదరాబాద్‌లో అడ్డుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‍లో ఐటీ ప్రొఫెషనల్స్  'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమం చేపడితే వారిని అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ చర్యలను తాము ఖండిస్తున్నామన్నారు.

నిజానికి తెలుగుదేశం నేతల ఆగ్రహంలో  అర్ధం ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంత వరకూ స్పందించలేదు. ఇక మంత్రి కేటీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో మాకేం పని. ఇక్కడ ఆందోళనలను అనుమతించం అని వ్యాఖ్యానించారు.   మొన్నేమో చంద్రబాబు అరెస్టుపై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులను విద్యార్థులను ఎక్కడిక్కడ నిర్బంధించేందుకు ప్రయత్నించారు. ఏపీలో రాజకీయ పంచాయితీలను ఏపీలోనే తేల్చుకోండి.. ఇక్కడేం పని అంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ టీడీపీ శ్రేణులలో ఆగ్రహం తెప్పిస్తూనే ఉన్నాయి. ఇది చాలదన్నట్లు శనివారం లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ విజయవంతమైంది. కేటీఆర్ ట్వీట్ చేసి ఒక్క రోజు కూడా గడవక ముందే చంద్రబాబుకు మద్దతుగా లెట్స్ మెట్రో ఫర్ హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. నిరసనకారులపై హైదరాబాద్ పోలీసులు దౌర్జన్యాలకు దిగారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు, ట్వీట్లను బేరీజు వేస్తూ టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.