రుషికొండ ప్యాలెస్ జగన్ బినామీలకు రాసిచ్చేశారా?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ రాజధాని కల నెరవేరుతుందో లేదో కానీ ఆయన విశాఖ రాజధాని పేరుతో చేస్తున్న హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. సాగర తీరాన అందంగా ఆకుపచ్చగా  చూడ ముచ్చటగా కనిపిస్తూ.. విశాఖ నగరాన్ని సముద్రుడి ఆగ్రహం నుండి కాపాడుతూ వచ్చిన రుషికొండకు ఇప్పుడు బోడి గుండు చేశారు. గత ఏడాదిగా ఈ కొండను తవ్వేసిన బకాసురులు.. గత ఆరు నెలలుగా యథేచ్ఛగా అక్కడ కట్టడాలను కూడా మొదలు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓపెన్ అయిపొయింది. ఔను నిజమే రుషికొండపై నిర్మాణాలు జరుగుతున్నాయని.. అవన్నీ ప్రభుత్వ భవనాలేనని ఒకసారి,  రాజధాని భవనాలని కాసేపు, కాదు కాదు పర్యాటక రంగానికి చెందిన భవనాలను మరొకసారి చెప్పుకొచ్చారు. కాగా  ఇక్కడే సీఎం నివాసం, క్యాంపు కార్యాలయాలు నిర్మిస్తున్నామని ఈ మధ్యనే ప్రభుత్వ వర్గాలు బాహాటకంగా చెప్పుకొచ్చాయి. ఈ దసరా నాటికే ఈ భవనాలన్నీ నిర్మాణం పూర్తయి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి గృహ ప్రవేశం చేయనున్నారని కూడా ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతున్నది.

 అయితే తాజాగా ఈ రుషికొండ నిర్మాణాలపై మరొక షాకింగ్ వార్త ప్రచారంలోకి వచ్చింది. రుషికొండపై కట్టే సీఎం నివాసం అధికారంలో ఉన్నా లేకపోయినా జగనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారని.. రేపు జగన్ అధికారం కోల్పోయినా ఆ నివాసం మరో ముఖ్యమంత్రికి చెందకుండా.. కేవలం జగన్ కోసమే కేటాయించేలా కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇందు కోసం ఏకంగా ఆ నివాసాన్ని జగన్ బినామీల పేరుపై కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వం లీజు అగ్రిమెంట్ చేసుకోనుందని కథనాలు వస్తున్నాయి. నిజానికి విశాఖ రుషికొండ ప్యాలెస్ నిర్మాణం వార్తలు రాగానే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిండా ఏడాది కూడా లేని ప్రభుత్వానికి జగన్ ఎందుకు కొత్తగా సీఎం నివాసాలు, క్యాంపు కార్యాలయాలు కడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నివాసంలో జగన్‌ ఎన్నాళ్లు కాపురం ఉంటారు. మహా అయితే మూడు నాలుగు నెలలే కదా.. సీఎంగా ఉన్నన్ని రోజులే కదా ఆ తర్వాత అవి ఖాళీ చేయాల్సిందే కదా అనుకున్నారు. ఎంత జగన్ ప్రభుత్వంలో కట్టినా అవి ప్రభుత్వ భవనాలు కదా ప్రభుత్వం మారితే ఖాళీ చేయాల్సిందే కదా అనుకున్నారు.

 కానీ  ప్రభుత్వాలు మారినా అది జగనుకే చెందేలా ఇప్పుడు ప్రణాళికలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రుషికొండలో కట్టడాలను పర్యాటక శాఖ పేరిట నిర్మిస్తుంది. దాని నుండి ప్రభుత్వం సీఎం నివాసం, కార్యాలయం కోసం తీసుకోనుంది. సరిగ్గా ఇక్కడే జగన్ అండ్ కో ఒక స్కెచ్ వేసినట్లు తెలుస్తున్నది. పర్యాటక శాఖ నుంచి లీజు పేరిట జగన్ బినామీలకు 33 ఏళ్ల పాటు దారాదత్తం చేసి.. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వాళ్లకి తిరిగి అద్దె చెల్లించి ఎన్ని సంవత్సరాలకు కావాలంటే అన్ని సంవత్సరాలకు వాళ్ళ నుండి లీజ్ అగ్రిమెంట్ చేసుకొనే ప్రణాళిక అమలవుతున్నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు ఏడాదికి మాత్రమే వాళ్ళు ప్రభుత్వానికి లీజుకి ఇచ్చినట్లు చూపిస్తే ఏడాది తర్వాత అక్కడ నుండి సీఎం ఖాళీ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి లీజుకి ఇచ్చుకోవచ్చు. ఇలా 33 ఏళ్ల పాటు అది జగన్ బినామీలపై అద్దె అగ్రిమెంట్ చేసుకొని.. జగన్ కోసమే అక్కడ ప్యాలెస్ నిర్మించుకున్నట్లు చెబుతున్నారు.  

నిజానికి   2021 నుంచే ఇందుకు సంబంధించి తెరవెనుక తతంగం నడుస్తోందని కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. టూరిజం భవనాల  రీడెవల్‌పమెంట్‌ పై 2021 మార్చిలో కేబినెట్‌ ఒక తీర్మానం చేసింది. అయితే, ఈ తీర్మానం ప్రకారం రాష్ట్రమంతా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఇలాగే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాల్సి ఉంది. కానీ, రుషికొండ మినహా రాష్ట్రంలో ఎక్కడా ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎక్కడా ఇలాంటి లీజ్ అగ్రిమెంట్లు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పర్యాటక భవనాల కోసం చేయాల్సిన ఖర్చంతా రుషికొండపైనే గుమ్మరించి ఇప్పుడు దాన్నే సొంతం చేసుకొనేలా అగ్రిమెంట్లు సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం ఈ రుషికొండ భవనాల కోసమే అప్పుడు క్యాబినెట్ తీర్మానం చేసిందని.. రుషికొండలో ప్రభుత్వం డబ్బుతో జగన్ ప్యాలెస్ కట్టుకోవడం కోసమే ఆ తీర్మానం తెచ్చారని ఇప్ప్పుడిప్పుడే అందరికీ అర్ధమవుతున్నది.