ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. 

అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.  

ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.  

అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu