బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ
posted on Oct 15, 2023 8:24AM
బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రులలో తొలి రోజు దుర్గాదేవి బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.ఆదివారం తెల్లవారు జామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.
తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది.
అలాగే శనివారం (అక్టోబర్ 14) నాటికి ప్రసాదాల కోసం మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.