అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?
posted on Dec 29, 2025 9:12AM

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ, అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు.
ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం. గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్ తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు.