నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పోస్టర్ల కలకలం.. కాంగ్రెస్ ఐక్యతకు భగ్నం!?

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మార్పు తరువాత కూడా పార్టీలో పరిస్థితులు కుదుటపడిన దాఖలాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం జరిగినప్పటి నుంచీ పార్టీ లో అసమ్మతి పెచ్చరిల్లింది. సీనియర్, జూనియర్ అంటూ పార్టీ రెండుగా చీలిపోయిన దాఖలాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధిష్ఠానం నష్ట నివారణ చర్యలలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ ను మార్చి ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్యం ఠాకూర్ ను నియమించింది.

ఆయన పార్టీలో విభేదాల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఉప్పు నిప్పుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు గాంధీ భవన్ వేదికగా కలుసుకుని ముచ్చటించుకున్నారు. దీంతో తాత్కాలికంగానైనా పార్టీలో విభేదాలు చల్లారాయని అంతా భావించారు. అయితే కోమటిరెడ్డి సొంత జిల్లాలో ఆయనకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ లో అసమ్మతి అగ్ని చల్లారలేదని అంటున్నారు. కోవర్ట్ వెంకటరెడ్డి అంటూ వెలసిన ఆ పోస్టర్ల వెనుక ఎవరున్నారన్నది తెలియకపోయినా.. నిఖార్సైన కాంగ్రెస్ వాదుల పేరిట ఈ పోస్టర్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోమటిరెడ్డి సొంత జిల్లా అయిన నల్లొండ జిల్లాలో వెలిసాయి. చందంపల్లి వద్ద వెలసిన ఈ పోస్టర్లలో కోమటిరెడ్డికి ‘నిఖార్సైన కాంగ్రెస్ వాదులు’ పలు ప్రశ్నలు సంధించారు. అసలు కోమటిరెడ్డికి కాంగ్రెస్ సభ్యత్వం ఉందా అంటు ప్రశ్నించారు.  

సొంత సోదరుడిని నార్కట్ పల్లిలో జెడ్పీటీసీగా ఎందుకు గెలిపించుకోలేని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా పార్టీ స్టార్ క్యాంపెయినర్ అవుతారని నిలదీశారు. ఇప్పుడిప్పుడే పార్టీలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని భావిస్తున్న తరుణంలో వెలసిన ఈ పోస్టర్లు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ పోస్టర్ల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ లో విభేదాల భగ్గుమనడం ఖాయమని సీనియర్లు అంటున్నారు.  ఈ పోస్టర్ల వెనుక ఉన్నదెవరైనా, ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మాణిక్ ఠాక్రే దౌత్యంతో సంతృప్తి చెందని వారే ఈ చర్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాహుల్ జోడో యాత్ర పూర్తయి.. ఇక రాష్ట్ర కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు ఉపక్రమించనున్న తరుణంలో వెలసిన ఈ పోస్టర్లు కలకలం రేపాయి.