వివేకా హత్య కేసులో తాడేపల్లి డొంక కదులుతోందా? అవినాష్ విచారణలో ఏం చెప్పారు?

వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందులలో సీబీఐ తీగ లాగితే తాడేపల్లి ప్యాలస్ లో డొంక కదులుతోందా? ఈ కేసులో వైఎస్ అవినాష్ ను సీబీఐ అధికారులు విచారిస్తే.. ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ లో కనిపించాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత శనివారం (జనవరి 28) సీబీఐ అధికారుల నోటీసుల మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. విచారణలో అవినాష్ అనివార్యంగా కొన్ని విషయాలు వెల్లడించాల్సి వచ్చిందని అంటున్నారు.

అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి వచ్చినా, సీబీఐ అధికారుల ప్రశ్నలకు ముక్తసరిగా, కాదు, తెలియదు అంటూ సమాధానాలు చెప్పాలని నిర్ణయించుకుని వచ్చినా అవినాష్ కు విచారణ సందర్భంగా ఆ అవకాశం లేకపోయిందని చెబుతున్నారు. అవినాష్ రెడ్డి విచారణ అనంతరం సీబీఐ దూకుడు చూస్తుంటే కీలక బ్రేక్ సాధించిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్ర ధారులు ఎవరన్న నిగ్గు తేలే సమయం ఆసన్నమైందన్న చర్చ కూడా సాగుతోంది.   అవినాష్ రెడ్డి విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా సీబీఐ జగన్ సర్కార్ లో అత్యంత ముఖ్యులుగా ఉన్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసిందని అంటున్నారు.  వారి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

అన్నిటికీ మించి సీబీఐ విచారణకుహాజరయ్యేందుకు హైదరాబాద్  చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐ కార్యాలయానికి వెళ్లడానికి ముందు  ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మతో   లోటస్ పాండ్ కు వెళ్లి మరీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకుని, ఆమెతో కొద్ది సేపు మంతనాలు జరిపిన తరువాతనే ఆయన సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన కోరిక మేరకు న్యాయవాదిని సీబీఐ అధికారులు అనుమతించలేదు. లాయర్ ను బయటే నిలిపివేసి అవినాష్ రెడ్డిని మాత్రమే లోనికి అనుమతించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి విలేకరులతో గంభీరంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పినా, తనను అనవసరంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేసినా ఆయన ముఖంలో, మాటల్లో గాభరా స్పష్టంగా గోచరిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

ఇక వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ దాదాపుగా దూరం పెట్టిన విజయమ్మతో భేటీ అవ్వడానికి కారణమేమిటన్నదానిపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ఇక విషయానికి వస్తే సీబీఐ అవినాష్ రెడ్డి విచారణ తరువాత మరో ఇద్దరు ముఖ్యులకు నోటీసులు జారీ చేసింది. ఆ ఇద్దరు ముఖ్యుల విచారణ మొత్తం కాల్ డేటాపైనే సాగనుందని అంటున్నారు.  ఆ విచారణలో సంచలన సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే  అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.