ఇండియాలో ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్.. కోటా ఫ్యాక్టరీ ఇప్పుడు తెలుగులో!

సినిమా ఇండస్ట్రీలో ఐఎమ్‌డీబీ రేటింగ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇండియన్ వెబ్ సిరీస్ లలో అత్యధిక ఐఎమ్‌డీబీ రేటింగ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ ‌' కోటా ఫ్యాక్టరీ'.  మొదటి రెండు భాగాలు ఇప్పటికే రిలీజై అత్యధిక వీక్షకాధరణ పొందాయి. ఇక ఇప్పుడు మూడవ సీజన్ విడుదలైంది.

మీర్జాపూర్, మనీ హీస్ట్ తర్వాత  అంతటి క్రేజ్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ కోటా ఫ్యాక్ట‌రీ (Kota Factory). ఇప్ప‌టికే రెండు సీజ‌న్లుగా వ‌చ్చిన ఈ సిరీస్‌ ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుని ఆల్‌టైమ్ బెస్ట్ షోల‌లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ఈ సిరీస్ ప్రాముఖ్యత ఏంటంటే అంతా క‌ల‌ర్‌లో కాకుండా బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉంటుంది. మ‌యూర్ మోర్ (Mayur More), జితేంద్ర కుమార్ (Jitendra Kumar), ఉర్వి సింగ్ (Urvi Singh), రేవ‌తి పిళ్లై (Revathi Pillai), అహ్సాస్ చన్నా (Ahsaas Channa) వంటి వారు న‌టించ‌గా రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు.

ప్రతీ విద్యార్థి ఉన్నత చదువుల తర్వాత కోచింగ్ కి వెళ్ళి ఏదో ఒక కోర్స్ నేర్చుకొని జాబ్ సంపాదించాలనుకుంటాడు. అలా విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లు దాదాపు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ అమీర్ పేట్ లోని సెంటర్లు ఎలాగో, రాజస్థాన్‌లోని 'కోటా' లో కూడా అలాగే ఉంటుంది. కోటా నేపథ్యంలో ఈ సిరీస్ అంతా సాగుతుంది. ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసి ఇంట‌ర్‌లో జాయిన్ అయి JEE and NEET ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతూ ఐఐటీ (IIT) చేరేందుకు వైభ‌వ్ అనే కుర్రాడు చేసిన‌ జ‌ర్నీ ఈ సిరీస్ లో ఉంటుంది. వైభ‌వ్‌తో పాటు జీతూ, నీనా, ఉద‌య్‌, వ‌ర్తిక‌, సివంగి, మీన వంటి ముఖ్యమైన పాత్ర‌ల చుట్టూనే ఈ సిరీస్‌ సాగుతుంది. మ‌న జీవితంలో మ‌నకు ఎదురుప‌డే అనేక సిచువేషన్స్ ని ఈ సిరీస్‌లో చూపించారు. ఒక్కో ఎపిసోడ్‌ మ‌నం ఒత్తిడుల‌ను ఎలా అదుపులో పెట్టుకోవాలి.. ఎలా చ‌ద‌వాలి.. స‌వాళ్ల‌ను ఎలా అధిగ‌మించాలనే మంచి మెసేజ్‌ కూడా ఇస్తుంటాయి. అయితే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉందో.. విద్యార్థి కోచింగ్ సెంటర్ల చుట్టూ ఎలా తిరుగుతున్నారూ చూపిస్తూ సాగే ఈ కథ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది.

మొద‌టి రెండు భాగాలు ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా జూన్ 20 నుంచి కోటా ఫ్యాక్ట‌రీ 3వ సీజన్ నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైంది. వీటిలో మొద‌టి రెండు సీజ‌న్లు తెలుగు భాష‌లోనూ స్ట్రీమింగ్ అవుతుండ‌గా తాజాగా రిలీజైన మూడ‌వ సీజ‌న్ కేవ‌లం హాందీ భాష‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో తెలుగులోనూ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరి ఇంకెందుకు లేటు ఓసారి చూసేయ్యండి.