హస్తినకు చంద్రబాబు.. కేంద్రం సహకారం కోసం వినతులు.. జగన్ విధ్వంసంపై నివేదికలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం )జులై 3) హస్తినకు ఏగనున్నారు. చంద్రబాబు హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత చంద్రబాబు హస్తినకు వెళ్లడం ఇదే మొదటి సారి.     విజయవాడ విమానాశ్రయం నుంచి బుధవారం (జులై 3)న బయలుదేరి  ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం (జులై 4)  ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఆ తరువాత హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరలను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.  

ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులతో  విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు,  పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు వంటి అంశాల్లో కేంద్రం సహకారాన్ని కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

అలాగే గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, జగన్ విధానాల కారణంగా కుదేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చంద్రబాబు నివేదికలు ఇవ్వనున్నారు. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కూడా కేంద్రాన్ని చంద్రబాబు కోరనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట  మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా హస్తినకు వెడతారు.