టిక్కెట్ రాకపోవడానికి కేటీఆరే కారణం: కొండా సురేఖ

తెరాస ప్రకటించిన తొలిజాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో అసంతృప్తికి గురైన కొండా దంపతులు.. సోమాజికగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.. ఈ సందర్భంగా మాట్లాడిన కొండా సురేఖ.. వరంగల్ తూర్పు నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన తనను ఆ జాబితాలో ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.. బీసీ మహిళనైన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.. 105 మంది జాబితాలో తన పేరు ప్రకటించకపోవడానికి కారణాలేంటని ఆమె ప్రశ్నించారు.. గత ఎన్నికలలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకుంటే, చాలాసార్లు తమకు వర్తమానం పంపారని.. అయితే పరకాల సీటు ఇస్తేనే తెరాసలోకి వస్తామని తాము తేల్చిచెప్పామని.. అందుకు కేసీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని ఆమె గుర్తుచేశారు.

 

 

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం అమానించడమే అని అన్నారు.. టీఆర్‌ఎస్‌లో తాము చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు.. మహిళకు మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వంగా తెరాస చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదన్నారు.. గతంలోను తాను మంత్రి పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టానని గుర్తుచేశారు.. హరీశ్ రావు, కేసీఆర్‌లతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఇద్దరూ ఫోన్ ఎత్తలేదని అన్నారు.. ఎవరి ప్రభావంతో తన టికెట్‌ ఆపారో చెప్పాలన్నారు.. తాము రెండు సీట్లు అడిగామనడం అబద్ధమని, తమను పొమ్మనలేక పొగబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు.. తమ ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు.. తెలంగాణ, కల్వకుంట్ల వారి ఇల్లు కాదని విమర్శించారు.. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడానికి కేటీఆరే కారణమని, తెరాసలో కేటీఆర్ కోటరీని తయారుచేస్తున్నారని ఆరోపించారు.. తెరాస తీసుకునే నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ గురించి వెల్లడిస్తామని కొండా సురేఖ స్పష్టం చేసారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu