నామినేటెడ్ పోస్టులకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్?

నామినేటెడ్ పోస్టులకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్?

కాంగ్రెస్ లో ఇక సందడే సందడి!

ఉప ఎన్నికల ఉపద్రవాన్ని తట్టుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికలు జరగబోయే 18 అసెంబ్లీ నియోజక వర్గాలకు కోట్లాది రూపాయల మేరకు ప్రత్యేక నిధులు అందజేశారు. ఈ నిధుల్లో పర్సంటేజీలు వస్తాయనే ఆశతో కాంగ్రెస్ నాయకులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారిని మరింత సంతోషపరచడానికి కిరణ్ కుమార్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న నామినేటేడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈయన తన నిర్ణయానికి పార్టీ హైకమాండ్ ఆమోదం కూడా సంపాదించారని తెలిసింది.

ఉప ఎన్నికల్లోగా ఈ పదవులు భర్తీ చేస్తే నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి నూతనోత్సాహం ఇవ్వాలంటే వెంటనే నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాల్సిందేనని ఆయన హైకమాండ్ కు చెప్పినట్లు తెలిసింది. అయితే దీనిపై పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు పదవులు పంచిపెడిదే వాటిని పొందిన వారు సంతోషంగానే ఉంటారు కానీ పదవులు పొందలేని వారు తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రమాదం వుందని ఆయన భయపడుతున్నట్లు తెలిసింది. దీనికి కిరణ్ పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అన్నీకాకున్నా కొన్ని పదవులు భర్తీ చేసి నిరాశకు గురవుతారనుకున్న వారిలో ఆశలు సజీవంగా ఉంచుదామని, ఎన్నికల అనంతరం మరికొందరికి పదవులు ఇస్తామని చెబుదామని అన్నట్లు తెలిసింది. దీనికి బొత్స కూడా అంగీకరించినట్లు తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu