తన భార్యకు పురుష డాక్టర్ "పురుడు" పోశాడని..!

నిండు గర్భిణి ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఒక ప్రాణం మరోక ప్రాణాన్ని భూమి మీదకు తీసుకువచ్చేందుకు యుద్ధం చేస్తుంటే ఏ డాక్టరైనా చూస్తూ ఊరుకుంటాడా..? శాయశక్తుల ప్రయత్నించి రెండు ప్రాణాల్ని కాపాడుతాడు. అలా ప్రసవ వేదనతో గిలగిలాకొట్టుకుంటున్న ఒక మహిళకు కాన్పు చేయడం ఆ డాక్టర్ ప్రాణాలమీదకు తీసుకువచ్చింది. రియాద్‌లోని కింగ్ ఫహాద్ ఆస్పత్రికి పురిటి నొప్పులతో ఓ మహిళ చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయడం అనివార్యమని తేల్చారు. అయితే ఆ సమయానికి మహిళా డాక్టర్లు లేకపోవడం పైగా పరిస్ధితి విషమిస్తుండటంతో ఒక పురుష డాక్టర్ పెద్ద మనుసుతో వైద్యం చేసి ప్రాణాలు రక్షించాడు.

 

అయితే ఆపత్కాలంలో తన భార్యకు పురుడు పోసినందుకు ఆ భర్త సదరు డాక్టర్‌పై ద్వేషం పెంచుకున్నాడు. అతన్ని ఎలాగైనా చంపాలనుకుని ప్లాన్ గీశాడు. దాని అమలు జరపడంలో భాగంగా ఆ వైద్యుడికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి వచ్చి అనుమతి తీసుకున్నాడు. ఆస్పత్రి ఆవరణలో ఇద్దరు సంభాషణలు కొనసాగుతుండగానే మహిళా గైనకాలజిస్టుతో తన భార్యకు కాన్పు ఎందుకు చేయించలేదని ఆగ్రహిస్తూ తనతో పాటు తెచ్చిన తుపాకీతో వైద్యుడిపై కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది డాక్టర్‌ను చికిత్స నిమిత్తం తరలించారు. అయితే సిబ్బంది రాకను గమనించిన ఆ భర్తగారు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.