ప్రతిపక్షాల జాడ ఏది!

ఖమ్మం, వరంగల్, అచ్చంపేటల్లో స్థానిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలూ వచ్చేశాయి. అయినా తెలంగాణ ప్రజలు ఒక్కసారి అలా ఫలితాలను పైపైన చూసి ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఎందుకంటే ఫలితం ఆశించిందే కనుక! మహా అయితే సంఖ్య కాస్త అటూఇటూగా ఉండవచ్చు... అంతే! ఈ మూడు ప్రాంతాల్లో ఎన్నికలు ఎంత ఏకపక్షంగా సాగాయంటే, దారిన పోయే దానయ్యని అడిగినా కూడా రాబోయే ఫలితాన్ని చెప్పగలిగేవాడు.

 

ఖమ్మం ఖిల్లా మొదటినుంచీ వామపక్షాల ఎర్రజెండాతో రెపరెపలాడేది. ఎన్నికలు స్థానికమైనా, అసెంబ్లీకైనా... ఆఖరికి పార్లమెంటుకైనా సరే! వరంగల్‌ నుంచి ఒక్క సీటన్నా రాకపోతుందా అని వామపక్షాలు ఎదురుచూసేవి. అలాంటిది ఖమ్మం నగరపాలక సంస్థలోని 50 స్థానాలలో...  నాలుగంటే నాలుగు స్థానాలతో వామపక్షాలు సరిపెట్టుకున్నాయి. సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు కోడలు సైతం కార్పొరేటర్‌గా గెలవలేని పరిస్థితి. తెరాస ముఖ్యనేత తన దృష్టినంతా ఖమ్మం మీదే కేంద్రీకరించడంతో గులాబీ గుబాళించిపోయింది. మొదటి నుంచీ ఇక్కడ అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీ ఇప్పుడు కూడా సున్నా స్థానాలతో అంతంతమాత్రంగానే మిగిలిపోయింది. అయితే వరుస పరాజయాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ ఖమ్మంలో 10 స్థానాలను కైవసం చేసుకోవడంతో ఈ పార్టీ నెత్తి మీద పాలు పోసినట్లైంది. తెరాస ధాటికి అల్లల్లాడుతున్న ప్రతిపక్షాలకి ఐదో వంతు స్థానాలు రావడం కూడా గొప్ప ఊరట అనడంలో సందేహం లేదు.

 

సెటిలర్లు ఎక్కువగా ఉండే ఖమ్మంలో ఒకప్పుడు తెదెపాకు కూడా మంచి పట్టు ఉండేది. ఖమ్మం తెదెపా అంటేనే తుమ్మల నాగేశ్వరరావు గుర్తుకువచ్చేవారు. అలాంటి తుమ్మల తెరాస తీర్థం పుచ్చుకోవడంతో సమీకరణాలు చిన్నాభిన్నం అయిపోయాయి. తుమ్మల చుట్టూనే అల్లుకున్న తెదెపా క్యాడర్‌ మొత్తం ఇప్పుడు తెరాస తరఫున ఉంది. కాబట్టి మున్ముందు ఖమ్మంలో తెదెపా తన ఉనికి నిలబెట్టుకోవాలంటే క్యాడర్‌ను మళ్లీ నిర్మించుకోవలసిన పరిస్థితి.  విజయవాడకి కూతవేటు దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా మీద చంద్రబాబు దృష్టి సారించడం అంత కష్టం కాకపోవచ్చు.

 

ఖమ్మంలో తెదెపాకి తుమ్మల నాగేశ్వరరావు వల్ల జరిగిన నష్టమే వరంగల్లో కూడా పునరావృతమైంది. తమలో తమకి ఎన్ని విభేదాలు ఉన్నా కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావులు... వరంగల్‌ జిల్లాలో తెదెపాకి బలమైన నాయకులుగా నిలిచేవారు. ఇప్పుడు వారిద్దరూ తెరాసలో కలిసిపోవడంతో వారితో పాటు క్యాడర్‌ కూడా గల్లంతైంది. ఒకప్పుడు మేయర్‌ పీఠాన్ని సైతం కైవసం చేసుకున్న తెదెపా ఖాతా ఇప్పుడు సున్నా దగ్గరే ఆగిపోయింది. దీనికితోడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న కడియం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలే జోరు మీదున్న తెరాసకి ఇక అడ్డేముంటుంది. వరంగల్‌ నగరపాలక సంస్థలోని మొత్తం 58 స్థానాలలో 44 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. మరో ఎనిమిది మంది విజేతలు కూడా తెరాస రెబల్స్‌ కావడమే విశేషం. వీరు కూడా తెరాసకి మద్దతిచ్చే అవకాశం ఉంది కనుక తెరాస మొత్తం బలం 52గా భావించవచ్చు. అంటే దాదాపు 90% స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది!

 

ఇక అచ్చంపేట నగరపంచాయతీ పరిస్థితి మరీ చిత్రం. ఎన్నడూ లేనిది కాంగ్రెస్‌, తెదెపా, భాజపా.... ఈ మూడు పార్టీలు ఏకతాటి మీదకు వచ్చినా కూడా 20 స్థానాలలో ఒక్క స్థానం కూడా ప్రతిపక్షాలకు దక్కలేదు. తెరాస కారుకి, అచ్చంపేటలో బ్రేకులు లేకుండా పోయాయి. 20కి 20 స్థానాలూ ఆ పార్టీకే దక్కాయి.

 

గ్రేటర్‌ ఎన్నికల పరాభవంతో విస్తుపోయిన ప్రతిపక్షాలు త్వరగా తేరుకుని ఉంటే ఫలితాలు ఇంత దారుణంగా ఉండేవి కావేమో! గ్రేటర్‌ ఓటమికి కారణం మీరంటే మీరు అంటూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉండగానే... ఈ ఎన్నికలు రావడం పోవడం కూడా జరిగిపోయింది. పైగా తెరాసను అడ్డుకునేందుకు కానీ, తమ బలాన్ని మెరుగుపరుచుకునేందుకు కానీ వారి వద్ద స్పష్టమైన ప్రణాళిక ఏదీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఎన్నికలలో పోటీ చేసే ముందే వారు ఓటమిని అంగీకరించినట్లుగా కనిపిస్తోంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న తెరాస ఈ ఎన్నికలను తేలికగా తీసుకోలేదు. గ్రేటర్ ఎన్నికలు జరుగుతుండగానే ఎర్రబెల్లిని తమవైపుకి తిప్పుకుని, ప్రత్యర్థులని ముందుగానే దెబ్బతీశారు.

 

ఇప్పటికైనా ప్రతిపక్షాలకు మించిపోయిందేమీ లేదు. మరో మూడేళ్లకి పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. తెలంగాణ తరఫున పార్లమెంటులో తమ ఉనికిని నిరూపించుకోవాలంటే, ఇప్పటి నుంచే ఒక ప్రణాళికను ఏర్పరుచుకుని, దాని ప్రకారం నడుచుకోవల్సి ఉంటుంది. క్యాడర్‌ దగ్గర్నుంచీ నాయకత్వం వరకూ పార్టీని నిర్మించుకోవాల్సిందే. ప్రజల్లో తమపట్ల విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పాల్సిందే! లేకపోతే మూడేళ్ల వ్యవధి తరువాత కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాలే పునరావృతం అవుతాయి. ఏ రాష్ట్రంలోనైనాగానీ ప్రతిపక్షాలు నామమాత్రంగా మిగిలిపోవడం ఆ రాష్ట్రానికే కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు!