చంద్రబాబు హస్తిన టూర్... మోడీ, అమిత్ షాతో భేటీ!?
posted on Mar 17, 2025 10:12AM
.webp)
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో సారి హస్తిన పర్యటకు సిద్ధమయ్యారు. మంగళవారం (మార్చి 18) ఆయన హస్తినలో పర్యటించనున్నారు. ఇటీవల తరచూ హస్తిన బాట పడుతున్న చంద్రబాబు అక్కడ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏలో కీలక బాగస్వామిగా తెలుగుదేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రాష్ట్రం కోసం ఏదైనా ఇలా కోరితే.. కేంద్రం అలా మంజూరు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా మంగళవారం (మార్చి 18) ఢిల్లీ పర్యటనకు వెడుతుండటంతో ఈ సారి రాష్ట్రానికి ఏం సాధించుకువస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.
అయితే కేంద్ర వ్యవసాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహం అదే రోజు ఢిల్లీలో జరగనుంది. ఆ వివాహవేడుకకు చంద్రబాబు హాజరౌతున్నారు. అయితే ఆయన ఊరికే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వచ్చే పరిస్థితి ఉండదనీ, పనిలో పనిగా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి.. ఆయా శాఖల నుంచి ఏపీకి ఏదో ఓ మేరకు ప్రయోజనం చేకూరేలా ఆయన అడుగులు పడతాయని అంటున్నారు. కాగా ఈ పర్యటనలో చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే విధంగా అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇందు కోసం ఆయన ప్రధాని మోడీతో కూడా భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం.