ఆంధ్రాబడ్జట్- అంకెలు బాగున్నాయి కానీ...
posted on Mar 11, 2016 9:05AM
.jpg)
ఆంధ్రప్రదేశ్.... ఏర్పడి ఇంకా రెండేళ్లు కూడా కాలేదు! ఒకపక్క తనకంటూ ఓ రాజధాని కూడా పూర్తి కాలేదు. మరోపక్క కేంద్రం నుంచి వస్తుందన్న సాయం మీద స్పష్టమైన మాటలు వినిపించడం లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి భుజం తట్టి వెళ్లిపోయేవారే కానీ, చేయి పట్టుకుని నడిపించేవారు కనిపించడం లేదు. ఎలాగొలా నిలదొక్కుకుందామని అనుకుంటే అదను చూసుకుని అజమాయిషీ చేసే ఉద్యమాలు మొదలయ్యాయి! ఒకరకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో రియల్ఎస్టేట్ వ్యాపారులు తప్ప మరెవ్వరూ అంత సంతృప్తిగా ఉండే పరిస్థితులు లేవు. ఇలాంటి గడ్డుకాలంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన 1,35,689 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ సాదాగా సాగిపోయిన మాట వాస్తవమే! ఎందుకంటే అందులో ఆకాశాన్నంటే హామీలు ఏవీ లేవు. ఇప్పటివరకూ ఉన్న లక్ష్యలను పూర్తిచేసేందుకే యనమల ప్రాధాన్యతను ఇచ్చారు. కేంద్రం నుంచి సాయం రాలేదన్న ‘లోటునూ’ పూడ్చేందుకు ప్రయత్నించారు. మొన్నటికి మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో పోలవరానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే! ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ తన నిరసనను వ్యక్తం చేసేసరికి కేంద్ర మంత్రి ఉమాభారతి హడావుడిగా ‘కాదు.... కాదు.... 1,600 కోట్లు ఇవ్వనున్నాం’ అని తడబడ్డారు. కేంద్రం చేసిన పనికి ఒళ్లు మండిందో ఏమోగానీ ఏకంగా పోలవరానికి ఏకంగా 3,500 కోట్లు కేటాయించారు యనమల. రాజధాని నిర్మాణానికి కూడా ఇదే తంతు. అమరావతి నిర్మాణానికి 1,500 కోట్లు కేటాయించి రాజధానికి ఓ ఊపుని తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
బడ్జెట్లో స్పష్టంగా కనిపించే మరో అంశం... సామాజికవర్గాల వారీగా కేటాయింపులు జరపడం. కాపులను బుజ్జగించేందుకు వేయికోట్లు కేటాయింపు ఎలాగూ తప్పనిసరి అని తేలిపోయింది. కానీ కాపులకు పెరుగుతున్న ప్రాధాన్యతతో కినుకు వహిస్తున్న బీసీలను ఊరడించేందుకు వారి సంక్షేమానికి ఏకంగా 8,832 కోట్లు కేటాయించారు. ఇక అందరికీ ఎంతో కొంత దక్కితే మాకేంటి అని బ్రాహ్మణులు అడుగుతారనుకున్నారో ఏమో వారికీ ఓ 65 కోట్లు కేటాయించారు. ఒకరకంగా చెప్పాలంటే కార్పొరేషన్ పేరునో, ఉపప్రణాళిక పేరునో దాదాపు బడ్జెట్లో 15 శాతానికి పైగా వివిధ సామాజికవర్గాలకే కేటాయించారు. ఈ తరహా కేటాయింపులు ఎక్కడికి దారితీస్తాయో విజ్ఞులకే ఎరుక. అయితే వివిధ కార్పొరేషన్లకు జరిగిన కేటాయింపులో కొంతశాతం యువకులకు అందించాలన్న నిబంధన ఒక్కటే కాస్త ఊరట కలిగించే అంశం. వేలకి వేలు కోట్లుగా జరిగిన ఈ కేటాయింపులు, అర్హులకు మాత్రమే అందేలా చూసే బాధ్యత ఏమంత తేలికైంది కాదు!
బడ్జెట్ ప్రసంగంలో కొన్ని భాగాలను యువతకూ, మధ్యతరగతికీ కూడా కేటాయించారు యనమల. యువత కోసం 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనీ, సొంత ఇంటి కలలు నెరవేరేందుకు గృహనిర్మాణ రంగానికి వేయి కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. కానీ ఇవి ఏ మేరకు అమలు జరుగుతాయో వచ్చే బడ్జట్ సమావేశాలనాటికి తేలిపోతుంది. ఇక వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ సంస్థలకీ కేటాయింపులు భారీగానే జరిగినట్లు కనిపించినా... రైతన్నలు ఆశలు పెట్టుకున్న రుణమాఫీకి కేవలం 3,512 కోట్లు మాత్రమే కేటాయించారు. పరిశ్రమలకీ, మౌలిక వసతుల కల్పనకీ కూడా బడ్జెట్ తగు ప్రాధాన్యతను ఇచ్చింది.
బడ్జెట్లో పలుశాఖలకు కేటాయింపులు ఒక ఎత్తైతే వాటికి నిధులు ఎలా సమకూర్చునున్నారన్న ప్రశ్న మరో ఎత్తు! యనమల చెబుతున్న లెక్కల ప్రకారం 26,849 కోట్ల రూపాయలు కేంద్ర నుంచి గ్రాంట్‌గా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రాంట్లు రావడంలో ఏమాత్రం తేడాపాడా జరిగినా ముఖ్యమైన ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇక రాష్ట్రంలోంచి వచ్చే రాబడుల లక్ష్యాన్ని 52 వేల కోట్లుగా నిర్ణయించారు. మరి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే జనాల ముక్కుపిండన్నా వసూలు చేసుకోవాలి, లేకపోతే పన్నులన్నా పెంచాలి. ఇదీ అంత తేలికైన విషయం కాదు. మరోవైపు ఆర్థికలోటుని పూడ్చేందుకు బహిరంగ మార్కెట్‌నుంచి 21 వేల కోట్ల రుణాలను తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన రుణాలకి ఇది కూడా తోడైతే మున్ముందు వాటికి పన్నులు కట్టేందుకు అవస్థలు పడక తప్పదు. మరి ఈ భారీ ‘బడ్జెట్’తో ఒక మంచి రాష్ట్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్న యనమల, అందుకోసం వనరులను ఎలా రాబట్టగలుగుతారన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం!