షరపోవా ఆట ముగిసినట్లేనా!
posted on Mar 9, 2016 9:08AM

టెన్నిస్ పట్ల ఆసక్తి ఉన్నా లేకున్నా, ప్రపంచంలో చాలామందికి షరపోవా అంటే ఎవరో తప్పకుండా తెలిసి తీరుతుంది. 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్‌ను సాధించిననాటి నుంచి... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో సెరీనా విలియమ్స్‌తో హోరాహోరీ పోరు సాగించిన రోజు వరకూ షరపోవా ఆటను ప్రతి టెన్నిస్ అభిమానీ ఆస్వాదిస్తూనే ఉన్నాడు. దశాబ్దకాలంపాటు టెన్నిస్‌లో అప్రతిహతంగా కొనసాగుతూ 35 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (సింగిల్స్)ను గెలుచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే షరపోవా అందం అన్నా, ఆ అందాన్ని మించిన ఆట అన్నా అభిమానులు పడిచస్తారు. అలాంటి వ్యక్తి నిషేధిత ఉత్ప్రేకరాన్ని వాడి పట్టుబడిందనీ, ఈ ఏడాది జరగబోయే ఒలంపిక్స్ నుంచి దూరం కానుందనీ తెలియడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా గాయాలతో బాధపడుతూ ఊగిసలాడుతున్న షరపోవా కెరీర్ ఈ దెబ్బతో తిరిగి పుంజుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది.
షరపోవా ‘మెల్‌డోనియం’ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకుందన్నది అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఆరోపణ. ఇప్పటికే షరపోవా నుంచి సేకరించిన రక్తనమూనాలో ఈ మందు ఉంది కాబట్టి, ఇందులో నిర్దోషినని షరపోవా చెప్పుకునేందుకు ఏమీ మిగలదు. కాబట్టి ఆట నుంచి నిషేధం ఎలాగూ ఖాయం. ఇక తాను తెలియక ఈ ఉత్ప్రేకరాన్ని వాడానని షరపోవా చెబుతున్న వాదనలో కూడా పస కనిపించడం లేదని క్రీడాపండితులు అంటున్నారు. తన గుండె పనితీరు సరిగా లేకపోవడం, కుటుంబనేపథ్యంలో డయాబెటీస్ ఉండటంతో దానికి విరుగుడుగా మెల్డోనియంను తీసుకున్నట్లు షరపోవా చెబుతోంది. కానీ మెల్‌డోనియం రక్తప్రసరణను మెరుగుపరిచే మాట వాస్తవమే అయినా..... ఆటగాళ్లు మరింత చురుకుగా ఆడేందుకు ఈ మెల్‌డోనియంను తీసుకుంటారన్నది బహిరంగ రహస్యం.
పదేళ్లుగా తాను ఈ మందుని వాడుతున్నాననీ, ఈ ఏడాది మొదట్లోనే దీనిని ఉత్ప్రేరకాల జాబితాలో చేర్చారని షరపోవా అంటున్న మాట వాస్తవమే! కానీ టెన్నిస్ సమాఖ్య తాజా జాబితాను తన వెబ్‌సైట్లో ఉంచుతుంది. తనకి అనుబంధంగా ఉన్న దేశాల టెన్నిస్ సమాఖ్యలన్నింటికీ జాబితాకు సంబంధించిన సమాచారాన్ని అందచేస్తుంది. పైగా మెల్‌డోనియం అమాయకమైన మందేమీ కాదు. అమెరికాలో ఇప్పటికీ ఈ మందుని అమ్మడం చట్టవ్యతిరేకం. ఇక తూర్పు ఐరోపాలోని చాలా దేశాలలో ఈ మందుని ఒక ఉత్ప్రేరకంగానే ఎక్కువగా వాడుతుంటారు.నాలుగేళ్ల వయసులోనే టెన్నిస్ రాకెట్‌ను పట్టుకుని తనకిష్టమైన ఆటలో ఓ చరిత్ర సృష్టించిన షరపోవా, అదే ఆట నుంచి అవమానకరంగా దూరం కావడం బాధించే విషయమే. అందుకే ఎంతో పరిణతితో కనిపించే ఈ క్రీడాకారిణి, తన నిషేధం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కన్నీటి పర్యంతం అయింది. ఒక పక్క ఆట నుంచి ఆమె ఎలాగూ కొంత దూరం కానుంది.
ఇక ఆర్థికంగా కూడా షరపోవాకి ఇది కోలుకోలేది దెబ్బ. అత్యంత ధనికురాలైన క్రీడాకారిణిగా ఉన్న షరపోవా ఇప్పడు ఒక్కొక్కటిగా తన వ్యాపార ఒప్పందాలను కోల్పోయే పరిస్థితిలో ఉంది. షరపోవా గురించి క్రీడాలోకం కరకాలుగా స్పందించింది. నిషేధిత జాబితా గురించి తనకేమీ తెలియదని షరపోవా చెప్పడం అతితెలివి అని కొందరంటే, షరపోవా తెలియకుండా ఓ ఉచ్చులో బిగుసుకుపోయిందని మరికొందరు జాలిపడుతున్నారు. ఎవరు ఏమన్నా, ఎలా అనుకున్నా ఒకటి మాత్రం నిజం! టెన్నిస్ నుంచి షరపోవా కనీసం మరో ఏడాది కాలం దూరం కానుంది. మరి ఆ తరువాత తిరగి ప్రపంచస్థాయి ఆటతీరుని ప్రదర్శిస్తుందా! మరో సంచలనానికి దారి తీస్తుందా! అలా జరుగుతుందనే ఆశిద్దాము! మరోవైపు షరపోవా ఉదంతం ఇతర క్రీడాకారులకు ఓ గుణపాఠంగా నిలవాలని కోరుకుందాము!