లాజిక్కుకు అందవు .. కేసీఆర్ మాటలు డమ్మీ తూటాలే..
posted on Oct 31, 2022 5:22PM
కేసీఆర్ మాటల మాంత్రికుడు.. ఎదుటి వారిని మెస్మరైజ్ చేసే వాగ్ధాటి ఆయన సొంతం.. ఆ వాగ్ధాటితోనే తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. ఆ వాగ్ధాటితోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల ఉనికిని నామమాత్రంగా చేసి దాదాపు ఏకఛద్రాధిపత్యం సాగించారు. కానీ ఇప్పుడు ఆ వాగ్ధాటిలోని డొల్లతనాన్ని విపక్షాలే కాదు.. జనసామాన్యం సైతం గుర్తిస్తున్నారు. ఇష్టారీతిన విమర్శలు గుప్పించేయడం.. ఆధారాలు, హేతువు గురించి ఇసుమంతైనా పట్టించుకోకపోవడం.. యెడాపెడా హామీలు గుప్పించేసి ఆ తరువాత వాటి ఊసే ఎత్తకపోవడాన్ని విపక్షాలే కాదు..
జనం సైతం నిలదీస్తున్నారు. ఉద్యమ సమయంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రసంగిస్తుంటే.. సైద్ధాంతికంగా ఆయనతో విభేదించే వారు కూడా ఏకీభవించేవారు.. ఆయన మాటల ధార అలాంటిది. అందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, ఆఖరికి వామపక్షాలు కూడా తెలంగాణ విషయంలో చీలిక అంచుల వరకూ వెళ్లిపోయాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అయితే ఒకటి సమైక్యాంధ్ర అంటే.. మరొకటి ప్రత్యేక తెలంగాణ అన్నాయి. సమైక్యాంధ్ర అన్న పార్టీలోనూ మెజారిటీ క్యాడర్ ప్రత్యేక తెలంగాణ పల్లవే ఎత్తుకుంది. అలాగే క్రమశిక్షణకు మారు పేగా ఉండే తెలుగేదేశంలో కూడా సమైక్య, ప్రత్యేక వాదాలతో విభేదాలు పెచ్చరిల్లాయి. రెండు ప్రాంతాలలోనూ బలంగా ఉన్న తెలుగుదేశం ఆ కారణంగానే తెలంగాణలో బలహీన పడింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధిష్ఠానం రాష్ట్ర విభజనకు సై అంటే అధిష్ఘానం నిర్ణయాన్ని ఆంధ్రప్రాంత నేతలు, క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
లగడపాటి, ఉండవల్లి లాంటి వారు రాజకీయ సన్యాసం చేశారు. అలా చేయడానికి ముందు చివరి క్షణం వరకూ సమైక్యాంధ్ర కోసం నినదించారు. అదంతా గతం. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. గతంలో సమైక్యాంధ్రకు జై కొట్టిన పలువురు ఇతర పార్టీ నేతలను తెలంగాణకు జై అనిపించి పార్టీలో చేర్చుకుని కీలక పదవులు కట్టబెట్టారు. ఇదంతా కేసీఆర్ మాటల మరాఠీ కావడం వల్లనే జరిగింది. అయితే రాను రాను ఆయన మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు గడప కూడా దాటడం లేదన్న గ్రహింపు జనబాహుల్యంలో కలిగింది. ఎప్పటికీ పూర్తి కాని రుణమాఫీ, ఎవరికి ఎందుకు అందుతోందో అర్థంకాని దళిత బంధు.. కేవలం ఎన్నికల ముందే గుర్తుకు వచ్చే హామీలు.. క్రమంగా ప్రజలలో కేసీఆర్ పట్ల వ్యతిరేకతకు బీజాలు వేశాయి.
అవి మొలకలెత్తుతున్న సంకేతాలు దుబ్బాక, హుజారాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతోనే కనిపించాయి. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక.. కేసీఆర్ కు ముచ్చటగా మూడో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారం దక్కుతుందా? లేదా? అన్న విషయాన్ని తేల్చేసే పరీక్షగా మారింది. అయితే ఈ సారి మాత్రం ఆయన మాటల మాయలు సాగడం లేదనడానికి తార్కానాలు కనిపిస్తున్నాయి. ఆయన చేసి నిలుపుకోని వాగ్దానాలపై విపక్షాలే కాదు.. ప్రజలూ గళం ఎత్తుతున్నారు. కేసీఆర్ కేంద్రం డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందని కేసీఆర్ విమర్శిస్తే.. వ్యాట్ తగ్గించి రాష్ట్ర ప్రజల భారాన్ని మీరే తగ్గించొచ్చుగా అని ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ధనిక రాష్ట్రం అని పదే పదే చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వోద్యోగుల జీతాలు ప్రతి నెలా మొదటి తేదీకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న ప్రశ్న ప్రజల నుంచే వినిపిస్తోంది.
ఇక తాజా సంఘటన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై కేసీఆర్ బీజేపీపై విమర్శల బాణం ఎక్కుపెడితే..ప్రతి విమర్శల అస్త్రాలు సూటిగా వచ్చి కేసీఆర్ కే తగులుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపిస్తే విపక్షాలే కాదు జనం సైతం ఆ అమ్ముడుపోవడానికి సిద్ధపడిన ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. కేసీఆర్ ఇరత పార్టీల వారిని ఆకర్షిస్తే ఆపరేషన్ ఆకర్ష్.. అదే పని ఇతర పార్టీ వారు చేస్తే కొనుగోలూనా అని నిలదీసే పరిస్థితి మునుగోడులో ఉందని పరిశీలకులు అంటున్నారు.
ఇక తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలుకు ముందుకు రాని కేంద్రం.. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చింది అని కేసీఆర్ విమర్శిస్తే.. కొనుగోలు కోసం వారు తీసుకు వచ్చిన సొమ్ము ఏది? సోమ్ము కనిపించకుండా ఉత్తుత్తి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అన్న ప్రశ్నలు ఎదురు వస్తున్నాయి. ఒక వేళ బీజేపీ జంప్ జిలానీలను ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నం నిజమే అయానా.. అది కేసీఆర్ నేర్పిన విద్యయే కదా అని జనం చర్చించుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కు అనుకున్నంతగా ప్లస్ కాలేదని పరిశీలకులు అంటున్నారు. ఎంత హడావుడి చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కే బూమరాంగ్ అయినట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. మొత్తం మీద లాజిక్కు లేని కేసీఆర్ మాటలన్నీ డమ్మీ తూటాలేనని తేలిపోవడం తోనే మునుగోడు ఉప ఎన్నిక లో కేసీఆర్ కు పెద్దగా శుభ శకునాలు కనిపించడం లేదని విమర్శకులు అంటున్నారు.
అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సొంత మనుషులు ఆరోపణలు ఎదుర్కొవడంతో కేసీఆర్ దిక్కు తోచని స్థితిలో మునుగోడు ప్రచారాన్ని గాలికి వదిలేశారని పార్టీ వర్గాలే అంటున్నాయి. మొత్తం మీద ఉప ఎన్నికలు కేసీఆర్ కు పెద్దగా అచ్చి వచ్చినట్లు లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హుజూరాబాద్ ఫలితం మరోసారి రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పరిశీలకులలోనే కాదు.. పార్టీ శ్రేణుల్లోనూ వ్యక్తమౌతున్నాయి.