ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఎలక్షన్ గిమ్మిక్కేనా?

ఒక్కసారి గానీ అధికారానికి దూరమయ్యామా?.. మళ్లీ ఆ అధికారాన్ని అందుకోవడం కోసం చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావని.. అలా ఫీట్లు చేసే క్రమంలో తాతలే కాదు.. ముత్తాతలు సైతం దిగిరావాల్సి ఉంటుందని గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చాలా గట్టిగానే అర్థమైనట్లుందన్న చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఆ క్రమంలో అధికారాన్ని మరోసారి పదిలం చేసుకోవడానికి ఎన్ని ఫీట్లు అయినా చేయాలని కేసీఆర్ కు అర్దమైనట్లు కనిపిస్తోంది.   రాజకీయం అంటే రంగులు మార్చడం ఒక్కటే కాదని... మాటలు సైతం మార్చాల్సిందేననీ కేసీఆర్ కేసీఆర్ భావిస్తున్నారనీ, అలాగే వ్యవహరిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా కొద్ది సమయమే ఉన్నా.. ఇటీవల జరిగిన కేబినెట్‌ భేటీలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే సీఎం చేసిన ఈ ప్రకటనను తెలంగాణ ఆర్టీసీలోని కార్మికులే తొలుత నమ్మలేదని.. ఆ తర్వాత ఎప్పటికో కానీ వారికి కేసీఆర్ ప్రకటనపై నమ్మకం కుదర్లేదని ఆర్టీసీ కార్మికులే అంటున్నారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు.. తమను కూడా ప్రభుత్వంలో వీలినం చేయాలంటూ టీఎస్ఆర్టీసీ కార్మికులు దాదాపు 50 రోజులకు పైగా ఆందోళన బాట పట్టారు. ఆ  ఆందోళన సమయంలో కొందరు  కార్మికులు  మరణించారు. అయినా కేసీఆర్ స్పందించలేదు సరికదా.. ప్రగతి భవన్‌ సాక్షిగా ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో..  ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడమనే ఒక అంసబద్ధమైన, అసంభవమైన, అర్థరహితమైన, ఒక తెలివి తక్కువ నినాదాన్ని పట్టుకుంటరా?  అదో నినాదమానండీ! నాకర్థం కాదు. ఒక పనికిమాలిన, పిచ్చి రాజకీయ పార్టీలు, తలకాయమాసినోడు, నెత్తిమాసినోడు.. గీళ్లా.. నాకర్థం కాదు. అర్థముండాలె కద! ఆర్టీసీ విలీనమనేది వందశాతం అసంభవం. గవర్నమెంట్‌లో కలపడమనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంతకాలం అది జరిగేది కాదు. ఏపీలో ఆర్టీసీ గవర్నమెంట్‌లో కలవడంపై చూద్దాం. అక్కడ ఏం జరిగిందో. వాళ్లు ఒక ఎక్స్‌పరిమెంట్‌ చేసిండ్రు. అక్కడ ఏం మన్ను కూడ జరగలేదు. మీకు అంటే జర్నలిస్టులకు తెల్వదు. అక్కడ కమిటీ వేసి.. మూడు నెలలకో, ఆరు నెలలకో ఏదో చెప్తరంట కథ.  అది ఏం చెప్తరనేది చూడాలె. ఆర్టీసీ మునగక తప్పదు. ఎవ్వరూ కాపాడలేరు. ఆర్టీసీ సమ్మె మాత్రమే కాదు.. ఆర్టీసీయే ముగుస్తుంది’’ అని కేసీఆర్‌ అన్నారు. దీంతో ఆర్టీసీ విలీనం అన్న ప్రతిపాదననే సీఎం కేసీఆర్ ఓ రకంగా  ఎగతాళి చేసి పారేశారు. 

అయితే తమను విలీనం చేయమని.. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మళ్లీ కేసీఆర్ వద్ద మొరపెట్టుకోలేదు. వాళ్లు సైలెంట్‌గానే ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికులు ఎదురు చూడని ఆఫర్ ఇచ్చేశారు. దీనిపై పలు రకాల ఊహగానాలు జోరందుకొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని.. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, విధి విధానాలను.. బస్సులోని ప్రయాణికుల వద్దే ఆర్టీసి సిబ్బందిఏకరువు పెడుతున్నారని.. అలా కేసీఆర్ ప్రభుత్వంపై మౌత్ టు మౌత్ కాన్వాసింగ్  జోరుగా జరుగుతోందనీ,  ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో సైతం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యక్తమౌతోందనీ అర్ధం చేసుకున్న కేసీఆర్... ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో  గులాబీ పార్టీకి  ఓట్ల రూపంలో భారీ నష్టం వాటిల్లుతుందని భావనతోనే   ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అలాగే టీఎస్ ఆర్టీసీకి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లక్షల కోట్ల రూపాయిల విలువ చేసే స్థలాలు ఉన్నాయని.. వాటిని సైతం ప్రభుత్వ పరం చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రతిపాదన నిర్ణయం తీసుకొన్నారనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది. 

మరోవైపు ఇప్పటికే జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, వీఆర్ఏలు.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటూ ఇంటిలిజెన్స్ రిపోర్టులు ద్వారా ఈ ప్రభుత్వానికి నివేదిక అందిడం.. దీంతో వారిని సైతం వివిధ శాఖల్లో సర్థుబాటు చేశారన్న వాదన సైతం పోలిటికల్ సర్కిల్ వైరల్ అవుతోంది.   

ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారాన్ని అందుకోన్న కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవడం కోసం.. చేస్తున్న జిమ్మిక్కుల్లో ఇదోకటనే ఓ అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది. అదీకాక ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అలాంటి వేళ.. ఇటువంటి నిర్ణయాలు మరిన్నిటిని కేసీఆర్ తీసుకొనే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.