చిలుకా దొరకవే!

సాధారణంగా తమ వాళ్లు తప్పి పోయినప్పుడు వారిని వెతికే క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. కూడళ్లలో, బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్లలో వారి ఫొటోలతో కనిపించడం లేదు అంటూ పోస్టర్లు అంటించడం కద్దు. అలాగే తప్పిపోయిన తమ వారి ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామంటూ నజరానా కూడా ఆ పోస్టర్లో ప్రకటిస్తారు. ఇక ఇటీవలి కాలంలో తమ పెంపుడు జంతువులు తప్పిపోయిన సందర్భంలో కూడా పలువురు వాటి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోస్టర్లు కూడా వేస్తున్నారు. అలా తప్పి పోయిన పెంపుడు జంతువుల కోసం ఆరాటపడే వారిలో అత్యధికులు కుక్క, పిల్లి వంటి వాటి కోసం వెతుకులాట చేయడం చూశాం. ఇటీవల ఓ  ఉన్నతాధికారి తన పెంపుడు కుక్కను గాలించేందుకు ఏకంగా వందల సంఖ్యలో పోలీసులను వినియోగించి వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సామాజిక మాధ్యమంలో తన పెంపుడు చిలుక ఆచూకీ తెలిపిన వారికి పది వేల రూపాయలు బహుమతి అంటూ వెలిసిన పోస్టర్లు నెట్టింట వైరల్ అయ్యాయి.  మధ్యప్రదేశ్‌  దమోహ్‌ జిల్లాకు చెందిన దీపక్‌ సోనీ  పెంపుడు చిలుక ఎటో ఎగిరిపోయింది.

ఆ చిలుక ఫొటోలతో పోస్టర్లు వేసి ఆచూకీ చెప్పినవారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఊరంతా పోస్టర్లు వేసి, ఆటోకు మైకులు పెట్టి మరీ తన పెంపుడు చిలక ఆచూకీ కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.  నిజానికి దీపక్ సోనీ చిలుక ఇలా పారిపోవడం ఇదేమీ తొలిసారి కాదు.  గత నెలలో ఒకసారి ఇలాగే ఎగిరిపోయి మళ్లీ దానంతటదే ఇంటికి తిరిగొచ్చింది.

ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. రోజులు గడుస్తున్నా అది తిరిగి రాకపోవడంతో దీపక్ సోనీ కుటుంబ సభ్యులు ఆందోళన   పడుతున్నారు. ఆ చిలుక సరిగా ఎగరలేకపోతోందనీ, దానికి ఏదైనా హాని జరిగిందా అన్న ఆందోళన కలుగుతోందని  దీపక్‌ సోనీ అంటున్నారు.