తమ్మినేనికి గాంధీ గుబులు
posted on Aug 3, 2023 10:28AM
ఓ వైపు ఎన్నికలు దూసుకొస్తున్నాయి. అలాంటి వేళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి సొంత నియోజకవర్గం అముదాలవలసలో కొత్త నొప్పులు మొదలైనాయి. సొంత పార్టీలోనే అసమ్మతి కాక.. ఆయనను కుదురుగా కూర్చోనివ్వడం లేదు. అముదాలవలస నియోజకవర్గంలో మొత్తం మూడు పార్టీ కార్యాలయాలు ఉండగా... వాటిలో ఎవరికీ వారే కోటరీలు ఏర్పాటు చేసుకొంటూ.. ప్రస్తుత ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సీటుకు ఎసరు పెడుతున్నారు.
జులై 31వ తేదీ ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భారీగా ఫ్యాన్ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి. అయితే ఈ వేడుకలతో సువ్వారి గాంధీకి భారీగా మైలేజ్ పెరిగిందని అంటున్నారు. తమ్మినేని వర్గం కూడా అలాగే భావిస్తోంది. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం వర్గం.. గాంధీ బర్త్ డే వేడుకలకు వైసీపీ శ్రేణులు హాజరుకాకుండా చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి ఫలించ లేదు. దీంతో సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు కాస్తా.. ఆయన గారి బలప్రదర్శనకు వేదిక అన్నట్లుగా మారిపోయాయి.
ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆమదాలవలస ఎమ్మెల్యే టికెట్‌ను సువ్వారి గాంధీ ఆశిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం... ఈ ఏడాది జరుపుకొంటున్న జన్మదిన వేడుకల ద్వారా తన సత్తాతోపాటు తన మాస్ ఫాలోయింగ్‌ని సైతం వైసీపీ అధినాయకత్వానికి చూపించాలని భావించారు. ఆ ఉద్దేశంతో.. భారీగా ఏర్పాటు చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు స్పీకర్ తమ్మినేనికి ఆమదాలవలస పట్టణంపై పూర్తి పట్టున్నా కూడా.. సువ్వారి గాంధీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరగడంతో.. ఫ్యాన్ పార్టీ అధిష్టానానికి కొత్త సంకేతాలు పంపినట్లు అయింది.
ఇంకోవైపు ఈ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సువ్వారి గాంధీ తన ప్రసంగం ద్వారా.. ప్రజలను మరింతగా ఆకర్షించారు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో.. తాను ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు సువ్వారి గాంధీ విస్పష్టంగా చెప్పారు. ఈసారి కనుక తనకు టికెట్ ఇస్తే.. ఆమదాలవలసలో తన విజయం ఖాయమని.. అందుకు తన వెనుక ఉన్న క్యాడరే బలమైన సాక్ష్యమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
ఇక ప్రజా సమస్యల ప్రస్తావనలో వైలంట్‌గా ఉండే సువ్వారి గాంధీ.. నియోజకవర్గంలో పరిస్థితుల రీత్యా పొలిటికల్ స్పీచ్‌లలో కాస్త సైలెంట్‌గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తన జన్మదిన వేడుకల సందర్భంగా సూటిగా సుత్తిలేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం... తనకు టికెట్ కేటాయించాలంటూ తన వాణిని బలంగా వినిపించడంతో తమ్మినేని వర్గంలో గుబులు మొదలైంది.
ఇప్పటికే నియోజకవర్గంలోని సమస్యలను తీర్చడంలో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం ఘెరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వేళ సువ్వారీ గాంధీ రూపంలో మరో సమస్య.. అదీ సొంత పార్టీ నుంచే స్పీకర్ తమ్మినేనికి ఎదురైందనే ఓ చర్చ సైతం స్థానికంగా ఊపందుకొవడం గమనార్హం.