కేసీఆర్ ముందస్తు అడుగులు.. కాదు కాదు పరుగులు!

నోటితో చెప్పిన ప్రతి విషయాన్నీ నొసటితో కాదనడం కేసీఆర్ కు బాగా తెలిసిన విద్య. అందుకే ఆయన ముందస్తు ప్రశక్తే లేదని ఇటీవలి కాలంలో ఎన్నిమార్లు ఉద్ఘాటించినా రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా నమ్మకం కనిపించలేదు. ఇంత గట్టిగా చెబుతున్నారు కనుక ముందస్తు ఖాయం అన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమైంది.

అందుకు తగ్గట్టుగానే  కేసీఆర్ జిల్లాల కార్యాలయాలు, కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాల స్పీడ్ పెంచారు. ఆ సందర్బంగా ఏర్పాటు చేసే సభలలో వరాల జల్లులు కురిపించడంతో మాటు మరో మారు తెరాసకుఅవకాశం ఇవ్వాలన్న విజ్ణప్తులూ చేస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచే  ఢిల్లీ పీఠానికి గురిపెట్టానంటున్నారు. అందుకోసం తెరాసను తెలంగాణలో గెలిచించాలని కోరుతున్నారు. పాలమూరులో ఆదివారం కేసీఆర్ పర్యటన మొత్తం ఎన్నికల సందడినే స్ఫురింపచేసింది. ఆ సందర్భంగా ఆయన మాటలన్నీ ఎన్నికలను టార్గెట్ చేసే ఉన్నాయి.  

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశాన్నే చాటాయి. జాతీయ వ్యూహాన్ని మార్చి పూర్తిగా తెలంగాణ ఎన్నికలపైనే దృష్టి పెట్టిన కేసీఆర్ హామీలు, అభివృద్ధి పనులపై కాన్ సన్ ట్రేట్ చేయడానికి డిసైడైపోయారని అంటున్నారు.  ముందస్తు ప్రసక్తే లేదని ప్రకటించిన కేసీఆర్ అందుకు పూర్తి భిన్నంగా ఎన్నికల సన్నాహాలలో నిమగ్నమైపోయారన్న చర్చరాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత కేసీఆర్ ముందస్తు ఉండదని నోటితో చెబుతూనే.. తెరవెనుక ముందస్తు సన్నాహాలు మొదలెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ పరంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే కాదు... పాలన పరంగా కూడా కేసీఆర్ దూకుడు పెంచారు. పాలమూరుతో ప్రారంభించి.. డిసెంబర్ లో పలు జిల్లాలలో కూసీఆర్ పర్యటనలకు షెడ్యూల్ రెడీ చేసుకున్నారు.  

యదాద్రి పవర్ ప్లాంట్ పర్యటన, మెట్రో విస్తరణ, సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించడం, అలాగే  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి కసరత్తు,  సొంత స్థలాలు ఉన్న వారికి ఆర్థిక సాయం ఇలా ఇంత కాలం పట్టించుకోకుండా వదిలేసిన పథకాలను  పట్టాలు ఎక్కించబోతున్నారు. ఇక ఒక్కటొక్కటిగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఒక్కొక్కటి జారీ చేస్తున్నారు.  హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెడుతున్న  కేసీఆర్ స్పీడ్ ను చూస్తుంటే ముందస్తు తథ్యమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలతో పార్టీలో జోష్ పెంచుతుంటే మరో వైపు మంత్రి కేటీఆర్  గ్రేటర్ పరిధిలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు వరుస ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరిన్ని కోట్ల రూపాయల పనులకు వంకుస్థాపనలు చేస్తున్నారు.

బన్సీలాల్ పేట మెట్ల బావిని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. అలాగే గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలలో అభివృద్ధి పనులుకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో స్పీడ్ పెంచారు.  ఈ నేపథ్యంలోనే ముందస్తు ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. అయితే ముందస్తు తేదీపై మాత్రమే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం (డిసెంబర్ 6) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశాలలోనే ముందస్తు ప్రకటన చేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ఒక వేళ ఈ అసెంబ్లీ సమావేశాలలో ముందస్తు ప్రకటన లేకుంటే మరో రెండు నెలల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

అంత వరకూ వేచి ఉండి.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ముందస్తు ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మార్చి లోగా ముందస్తు ప్రకటన ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. అంటే వచ్చే ఏడది సెప్టెంబర్- అక్టోబర్ నెలల మధ్యలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  కేసీఆర్ తన ప్రసంగాలు, ప్రకటనల ద్వారా ఒక వైపు ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ ను రగులుస్తున్నారనీ, అదే సమయంలో మరో వైపు విపక్షాలను ముఖ్యంగా బీజేపీని తెలంగాణ ద్రోహిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.