గుజరాత్ లో కమల వికాసం - హిమాచల్ ..లో హంగ్ ?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసీ ముగియక ముందే గుజరాత్ తో పాటుగా హిమాచల్  ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి. ఇంతవరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలో ప్రీ పోల్ సర్వే ఫలితాలు సూచించిన విధంగా, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ వుంది.

గుజరాత్ లో మరోమారు బీజేపీ  అధికారం నిలబెట్టుకుంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ రెండు రాష్టలోనూ చతికిలపడింది. గుజరాత్ లోపరోక్షంగా బీజేపీ గెలుపుకు ఆప్  కొంత వరకు దోహదం చేసినా కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి చేర్చాలనే కేజ్రీవాల్  కల ఫలించలేదు. 

హిమాచల్ ప్రదేశ్ లో ఆత్మసాక్షి సర్వే ప్రకారం, బీజేపీకి 42 నుంచి 43.75 శాతం ఓట్లతో 31 నుంచి 35 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాసం వుంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పై స్వల్ప ఆధిక్యతతో, 44 నుంచి 44.5 శాతం వోట్  షేర్  తో 33 నుంచి 36 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఆప్ కు నాలుగు నుంచి ఐదు శాతం ఓట్లతో  2  నుంచి 3 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే సూచించింది. అలాగే  ఇతరులు  6 నుంచి 6.75 శాతం ఓట్లతో 2 నుంచి 3 సీట్లు గెలుచుకుంటారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఓక విధంగా హంగ్  ను సూచిస్తున్నాయి.   

అయితే గుజరాత్  ఓటర్లు మరో మారు బీజేపీకి అనుకూలంగా తీర్పు నిచ్చారని, ఆ పార్టీకి 45 నుంచి 46 శాతం ఓట్లు, 98 నుంచి 110 వరకు సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ  38 నుంచి 39 శాతం ఓట్లతో 66 నుంచి 71 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాను నిలుపుకుంటుంది. అలాగే, ఆప్    కి మూడవ స్థానానికే పరిమితమౌతుంది.  11 నుంచి 14శాతం ఓట్లతో, 9 నుంచి 14 సీట్లు తెచ్చుకుని ఆప్ ..మూడవ స్థానంతో సరిపెట్టుకోక తప్పదని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది.