కేసీఆర్ అఖిలపక్షసదస్సుకు హాజరు కావడం లేదు ?

కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది.తెలంగాణలో తెరాస అధికారంలో వుంది. ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వుంది. సహజం. రాజకీయ పార్టీల నడుమ విబేధాలు సహజం. కానీ, రాజకీయ విబేధాలు, రాజకీయాల వరకు పరిమితం అయితే ఓకే, కానీ, ఆ-గీత దాటి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితికి చేరితే, అది ఎంత మాత్రం అభిలషనీయం కాదు. కానీ,దురదృష్ట వశాత్తు, బీజేపీ, తెరాసల రాజకీయ యుద్ధం గీత దాటింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారుతోంది.అంతేకాదు,వ్యక్తిగత శతృత్వం స్థాయికి దిగజరుతోందా, అనే సందేహాలకు తావిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

గడచిన సంవత్సర కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాలుగైదు మార్లు తెలంగాణ పర్యటనకు వచ్చారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా ఆయన్ని కలవలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. ప్రధానికి స్వాగతం పలక లేదు.వీడ్కోలు చెప్పలేదు. ప్రోటోకాల్ సంగతి పక్కన పెట్టినా, కనీస రాజకీయ మర్యాదను పాటించలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు, ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ అదొక వివాదంగా మారుతోంది. సమాచారం ఉందని,  లేదని, పిలిచారని, పిలవలేదని ఇలా, గిల్లికజ్జాల వ్యవహారం నడుస్తోంది.  అదొక ఆనవాయితీగా మారిపోయింది. దీంతో, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. 
అదలా  ఉంటే, ఇప్పడు మళ్ళీ అలాంటి వివాదమే నడుస్తోంది.

మన దేశం జీ-20 అధ్యక్ష పదవిని దక్కించుకుంది. డిసెంబర్ 1, 2022 నుంచి సంవత్సర కాలంపాటు, మన దేశం ఈ పదవిలో కొనసాగుతుంది. ఈ సంవత్సర కాలంలో జీ – 20 వేదికగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఒక అవగాహన కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం   సోమవారం (డిసెంబర్ 5) అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నలభైకిపైగా రాజకీయ పార్టీల నాయకులకు ఆహ్వానం పంపింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సమబందించి, వైసీపీ అద్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

ఏపీలో రాష్ట్రపతి పర్యటన కొనసాగుతున్నందున జగన్ రెడ్డి సమావేశానికి హాజరు కాకపోవచ్చని అంటున్నారు, చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తెరాస అధ్యక్షడు కేసేఆర్, హాజరవుతున్నారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ అధ్యక్షడు జేపీ నడ్డా, ఇతర ప్రధాన పార్టీల అధ్యక్షులు అందరూ హాజరవుతున్నారు. నిజానికి, ఈ సమావేశంలో పాల్గొంటున్న వారిలో బీజేపీ మిత్ర పక్షాల కంటే, బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించే పార్టీల నేతలే ఎక్కువ మంది ఉన్నారు. అయినా, కేసేఆర్ మాత్రం ఎందుకనో, ఇంతటి  కీలక సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించుకున్నారు. 

అదలా ఉంటే టీఆర్‌ఎస్‌ నేత కె.కేశవరావు స్పందిస్తూ.. మా నాయకుడు సభకు హాజరవుతారనే సమాచారం తమకు లేదన్నారు. సింగపూర్‌లో చికిత్స పొందుతున్నందున ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. ఈ సమావేశానికి జనతాదళ్ యునైటెడ్ ప్రెసిడెంట్ నితీష్ కుమార్ కూడా హాజరయ్యే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.అయితే, ఇతరుల విషయం ఎలా  ఉన్నా, బీజేపీ, తెరాస సంబంధాలు ఉప్పు నిప్పులా భగ్గుమంటున్న నేపధ్యంలో   ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనడం వలన రాజకీయంగా తప్పుడు సంకేతాలు రాష్ట్రంలో తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆలోచనతోనే, ముఖ్యమంత్రి కేసేఆర్,ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అయితే, అదే సమయంలో, జాతీయ రాజకీయాలో కీలక పాత్రను పోషించేందుకు సిద్దమవుతున్న కేసేఆర్  జాతీయ స్థాయిలో జరుగతున్న సమావేశానికి హాజరు కాకపోవడం  జాతీయ స్థాయిలో  రాజకీయంగా రాంగ్ సిగ్నల్స్ పంపుతుందని అంటున్నారు. పొలిటికల్ సిగ్నల్స్ ఎలా ఉన్నా, నువ్వు గోకినా గోకకపోయినా నేను నిన్ను గోకుతూనే ఉంటానని, ప్రధానిని ఉద్దేశించి  ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన నేపధ్యంలో అయిన దానికి కాని దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై కయ్యానికి కాలుదువ్వుతున్నారనే సంకేతాలు అయితే వెళుతున్నాయని,అలాగే ముఖ్యమంత్రి ధోరణి విమర్శలకు గురవుతోంది తెరాస నాయకులే అంటున్నారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, రాజకీయం రాజకీయమే, పరిపాలన పరిపాలనే..; అన్నట్లు ఉండాలని అంటున్నారు.