కేసీఆర్ ను నిలదీసిన ఎర్రబెల్లి
posted on May 30, 2011 9:40AM
హైదరాబాద్
: మహానాడు వేదికపై ప్రసంగించిన అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు జై తెలంగాణ అనే నినాదంతో వేడుకలో పాల్గొన్న సమైక్యవాదులకు షాక్ ఇచ్చారు. మహానాడు వేదికపై మాట్లాడిన ఎర్రబెల్లి తన ప్రసంగం ముగిసిన అనంతరం జై తెలంగాణ, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినాదాలు చేశారు. ఎర్రబెల్లి వేదికపై జై తెలంగాణ అనడం సమైక్యవాదులకు సామాన్యంగా రుచించదు. మహానాడులో తీర్మానం కోసం పట్టుపడుతున్న టిఆర్ఎస్, కాంగ్రెసు పార్టీలతో పాటు ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డికి సరైన సమాధానం ఇవ్వడానికే వేదికపై జై తెలంగాణ నినాదం చేసినట్టుగా భావిస్తున్నారు.
కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. తెలంగాణను ఇచ్చేది తెచ్చేది మేమే అంటున్నా కాంగ్రెసును కెసిఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అడిగారు. నాగం జనార్దన్ రెడ్డి పార్టీని, తెలంగాణ టిడిపి ప్రజాప్రతినిధులను ఆగమాగం చేయాలని నిశ్చయించుకున్నాడని అయితే చివరకు ఆయన ఆగం అయ్యాడని అన్నారు. చంద్రబాబునాయుడు ఎప్పుడు కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేయవద్దని చెప్పలేదన్నారు. నాగం నోరు మూసుకుంటే మంచిందన్నారు. అందరం కలిసి పోరాడుదామంటే రావడానికి సిద్ధమని, కానీ తమ పార్టీని కించపరిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.
టిడిపి పేదల పార్టీ అని ఈ పార్టీని ఇరు ప్రాంతాల్లో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశాడని ఆ సమయంలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్న టిఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు. వైయస్ తెలంగాణ భూములను అల్లుడికి ధారాదత్తం చేస్తున్నప్పుడు కెసిఆర్‌కు తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పార్టీ జెండాతోనే తెలంగాణ కోసం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ పాలన సాగిస్తున్న టిఆర్ఎస్‌ను తరిమి కొడదామని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. అంతకుముందు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన వైయస్, కాంగ్రెసులకు తెలంగాణపై స్పష్టత లేదన్నారు. తెలంగాణపై టిడిపి ఇప్పటికే పలు వేదిలకలపై స్పష్టత ఇచ్చిందని చెప్పారు.