జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నేత పాదయాత్ర!!
posted on Jan 26, 2019 12:14PM
కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన తొలి నాయకుడు. ఇది నాలుగేళ్ల క్రితం మాట. ఇప్పుడు అంతా మారిపోయింది. 2014 ఎన్నికల సమయంలో జగన్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విష్ణు జనం మధ్యకు వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో శుక్రవారం పాదయాత్ర ప్రారంభించి కావలి వైసీపీలో వణుకు పుట్టించారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిది కాంగ్రెస్ కుటుంబం. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే వీరాభిమానం. కాంగ్రెస్ హయాంలో అక్రమాస్తుల కేసులో జగన్ తొలిసారి అరెస్ట్ అయిన సందర్భంలో వైఎస్ కొడుకును అరెస్ట్ చేయడం అన్యాయం అని మాట్లాడిన తొలి నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి. జగన్ సొంత పార్టీ జెండాతో బయటకు వచ్చినప్పుడు జిల్లా నుంచి వైసీపీలో చేరిన తొలి నాయకుడు కూడా ఆయనే. అయితే గత ఎన్నికల్లో కావలి టికెట్ ఆశించినా దక్కకపోవడంతో పార్టీ మీద అభిమానంతో వైసీపీ అభ్యర్థి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గెలుపునకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వాలని ఆనాడే ఈయన కోరినట్లు, తప్పకుండా ఇస్తానని జగన్ తనకు మాట ఇచ్చినట్లు విష్ణు చెబుతూ వచ్చారు. అదే ఆశతో సంక్రాంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లి టికెట్ విషయం జగన్ తో మాట్లాడారు. టికెట్ ఇవ్వడం కుదరదని జగన్ తేల్చి చెప్పడంతో వెనుతిరిగారు.
తను ఏ కుటుంబానికైతే వీరాభిమానిగా ఉన్నారో ఆ కుటుంబం నుంచే తనకు నిరాదరణ ఎదురుకావడంతో జగన్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ జనం మధ్యకు బయలుదేరారు. జగన్ తీరు నచ్చక పలువురు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే పార్టీలోనే ఉంటూ, జగన్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ తీర్పు కోసం జనం మధ్యకు వెళ్లిన తొలి నాయకుడు విష్ణు కావడం విశేషం. పాదయాత్ర ఆలోచనను విరమింపజేయాలని వైసీపీ అధిష్ఠానం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ విష్ణు తన నిర్ణయం మార్చుకోలేదు. తన విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తేల్చుకోవడం కోసం జనం మధ్యకు బయలుదేరారు. శుక్రవారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
విష్ణువర్ధన్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వలేమని జగన్ స్పష్టం చేసిన విషయం తెలుసు. రామిరెడ్డికే మళ్లీ టిక్కెట్టు ఇస్తారనీ తెలుసు. అధిష్ఠానం మాట కాదని ఆయన వెంట వెళ్లడం వల్ల సొంత పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుసు. వచ్చే ఎన్నికల్లో విష్ణు ఏ గుర్తుపై పోటీ చేస్తారో తెలియదు. అసలు పోటీ చేస్తారో లేదో గ్యారెంటీ లేదు. గెలుపు విషయంలో క్లారిటీ లేదు. అయినా.. విష్ణువర్ధన్‌రెడ్డి పాదయాత్రకు భారీ సంఖ్యలో జనం తరలిరావడం విశేషం. కావలితోపాటు ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కలిసిరావడంతో విష్ణు బలం మరింత పెరిగింది. వంటేరు వర్గం కూడా పెద్ద సంఖ్యలో పాదయాత్రకు సంఘీభావం తెలుపడం విష్ణు డిమాండ్‌కు అదనపు బలం చేకూరింది.
విష్ణువర్ధన్‌రెడ్డి పాదయాత్రకు మద్దతుగా వేల సంఖ్యలో జనం రావడం, వారిలో అత్యధికులు వైసీపీ అభిమానులు కావడం ఆ పార్టీ అగ్రనేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రజా మద్దతు కలిగిన నాయకుడు పార్టీకి దూరమైతే, లేక తిరుగుబాటు అభ్యర్థిగానో, మారో పార్టీ గుర్తుపైనో బరిలోకి దిగితే పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంపై పట్టున్న మరో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి కూడా విష్ణుతో జతకట్టడంతో వీరి కోరిక నెరవేరని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కావలితో పాటు పక్క నియోజకవర్గాల్లో సైతం వైసీపీకి నష్టం జరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.