బీజేపీలో చేరిన హీరోయిన్ జయప్రద
posted on Mar 26, 2019 3:07PM

ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ నుంచి జయప్రద పోటీకి దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. గతంలో రామ్‌పూర్ నుంచి జయప్రద రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆమెను రామ్‌పూర్ బరిలో దింపితే గెలుపు ఖాయమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
1994లో టీడీపీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జయప్రద.. 1996లో రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి 2004లో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై రామ్‌పూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జయప్రదను 2010లో సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ పార్టీ తరపున బిజ్‌నోర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.