జ‌న్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు.. రంగంలోకి కేసీఆర్!

తెలంగాణ రాజ‌కీయాల్లో జ‌న్వాడ ఫామ్ హౌస్ కేసు సంచ‌ల‌నంగా మారింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావ‌మ‌రిది రాజ్ పాకాల‌కు చెందిన జ‌న్వాడ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జ‌రిగిదంటూ సైబ‌రాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 35మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పురుషులు, మ‌హిళ‌లు ఉన్నారు. అక్క‌డ విదేశీ మ‌ద్యం స‌హా భారీగా మ‌ద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ యాక్ట్ సెక్ష‌న్ 34 కింద కేసు న‌మోదు చేశారు. అయితే, ఈ పార్టీలో కొంద‌రు డ్ర‌గ్స్ ను కూడా వినియోగించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. పార్టీలో పాల్గొన్న కొంద‌రికి డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఓ వ్యాపార‌వేత్త‌  కొకైన్ తీసుకున్న‌ట్లు నిర్ధార‌ణ అయింది. దీంతో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించారు.  పోలీసుల విచార‌ణ‌లో కేటీఆర్ బావ‌మ‌రిది ఆఫ‌ర్ చేస్తేనే తాను కొకైన్ తీసుకున్న‌ట్లు ఆయన చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇంతకూ కొకైన్ రాజ్ పాకాలకు ఎక్కడి నుండి వ‌చ్చింది.. దీని వెనక ఉన్న ముఠా ఎవరు? ఎన్నేళ్ల నుండి డ్రగ్స్ సరఫరా అవుతుందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఫామ్‌హౌస్ పార్టీ కేసులో ఏ1గా ఫామ్‌హౌస్ సూప‌ర్‌వైజ‌ర్ కార్తిక్‌, ఏ2గా రాజ్ పాకాల‌ను చేర్చారు.  అయితే, రాజ్ పాకాల ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసులో విష‌యంలో ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయం, 2గంటలకు మోకిలా పోలీస్ స్టేషన్ విచారణకు రావాల‌ని రాజ్ పాకాలకు పోలీసులు ఆదేశించిన‌ప్ప‌టికీ ఆయ‌న   డుమ్మా కొట్టారు. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకుని అందుబాటులోకి రాలేదు. దీంతో  రాయ‌దుర్గంలోని ఓరియ‌న్ విల్లాలో రాజ్ పాకాల ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించేందుకు అక్క‌డికి వెళ్ల‌గా.. విల్లాకు తాళంవేసి ఉండ‌టంతో వారు కొద్దిసేపు అక్క‌డే వేచి ఉన్నారు. స‌మీపంలోని మ‌రో విల్లాలో ఉన్నార‌ని స‌మాచారం రావ‌డంతో అధికారులంతా అక్క‌డికి వెళ్లారు. ఈలోగా భారీ సంఖ్య‌లో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అక్క‌డికి చేరుకొని ఆందోళ‌న‌కు దిగారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా త‌నిఖీ చేస్తార‌ని ప్ర‌శ్నించారు.

ఫామ్‌హౌస్ కేసుపై కేటీఆర్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌ పాల‌నపై ప్ర‌శ్నించినందుకే రాజ‌కీయంగా స‌మాదానం చెప్ప‌లేక ఇలాంటి కుట్ర‌ల‌కు తెర‌తీస్తున్నార‌ని, మా ధైర్యాన్ని దెబ్బ‌తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా దావ‌త్ చేసుకోవ‌డం త‌ప్పా..?  గృహ ప్ర‌వేశం సంద‌ర్భంగా బంధువుల‌ను పిలిచి దావ‌త్ ఇచ్చారు. కొంద‌రు రేవ్ పార్టీ అని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేవ‌లం అది కుటుంబ పార్టీ మాత్ర‌మేన‌ని.. అందులో చిన్న పిల్ల‌ల‌తో పాటు వృద్ధులు, కుటుంబాల‌కు చెందిన భార్యాభ‌ర్త‌లు పాల్గొన్నార‌ని కేటీఆర్ అన్నారు.  

జ‌న్వాడ ఫామ్‌హౌస్ పార్టీలో డ్ర‌గ్స్ వినియేగించార‌నే వార్త‌లు రావ‌డంతోపాటు.. కేటీఆర్ స‌తీమ‌ణికూడా పాల్గొన్నార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డం  రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. బీజేపీ ఎంపీలు బండి సంజ‌య్‌, ర‌ఘునంద‌న్ రావులు మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేసి కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు. బండి సంజ‌య్ మాట్లాడుతూ.. ఫాంహౌజ్ లో రేవ్ పార్టీ కేసును కేసును కాంగ్రెస్ ప్ర‌భుత్వం నీరుగార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నద‌ని ఆరోపించారు. పార్టీలో పాల్గొన్న వారంద‌రి పేర్ల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని, డ్ర‌గ్స్ వినియోగం విష‌యంపై నిగ్గుతేల్చాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య రాజ‌కీయ అనుబంధం కార‌ణంగానే ఈ కేసులో విష‌యాల‌ను బ‌య‌ట‌కు రాకుండా కాంగ్రెస్ పెద్ద‌లు పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంద‌ని అన్నారు. ర‌ఘునంద‌న్ రావు మాట్లాడుతూ.. ఫామ్ హౌస్, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో సీసీ కెమెరా పుటేజ్‌ల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు మీడియా ముందుకొచ్చి కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నద‌ని బీఆర్ఎస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయంగా కేటీఆర్‌ను ఎదుర్కోలేక కుటుంబ స‌భ్యుల‌ను టార్గెట్‌గా చేసుకొని అస‌త్య‌  ప్ర‌చారం చేస్తున్నార‌ని, రాజ‌కీయాల్లో ఇలాంటి ప‌రిణామాలు స‌రికాదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, ఈ కేసుపై ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు మీడియా ముఖంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. దీంతో నిజంగానే పార్టీలో డ్ర‌గ్స్ వినియోగం జ‌రిగిందా అనే అంశం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఆయ‌న పార్టీ కార్యక్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే, తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసుకు సంబంధించి కేసీఆర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాల గురించి స్వయంగా రాష్ట్ర డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేసి ఆరా తీశారు. పార్టీ కేసుకు సంబంధించి   ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల, అతని కుటుంబ సభ్యుల గృహాలపై పోలీసులు ఉ  తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలపై డిజిపితో ఫోన్లో కేసీఆర్ మాట్లాడుతూ .. సర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎందుకు చేస్తున్నారని, వెంటనే సోదాలను ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర గృహాలలో సోదాలను నిర్వహిస్తున్న తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ‌త కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉంటున్న కేసీఆర్ ప్ర‌స్తుత ప‌రిణామాల‌పై రియాక్ట్ కావ‌టంతో ఆయ‌న ఇక నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతార‌ని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేసీఆర్ కుటుంబాన్ని బ‌ద‌నాం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నద‌ని, వారికి స‌రైన గుణ‌పాఠం చెప్పేందుకు కేసీఆర్ మ‌ళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ కాబోతున్నార‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

అధికారం కోల్పోయిన త‌రువాత కేసీఆర్ ఒక్క‌సారి కూడా కాంగ్రెస్ నేత‌ల‌కు ఎదురుప‌డ‌లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కు డుమ్మా కొట్టారు. కేవలం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రోజు మాత్ర‌మే అసెంబ్లీకి కేసీఆర్ వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన బ‌డ్జెట్ పై అసంతృప్తి వ్య‌క్తం చేసి.. ఇక నుంచి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాన‌ని హెచ్చ‌రించారు. అయితే, ఆ త‌రువాత కూడా కేసీఆర్ ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. తాజాగా జ‌న్వాడ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి కేసీఆర్ స్పందించ‌డంతో.. ఇక‌నుంచి ఆయ‌న పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతార‌నే చ‌ర్చ జ‌రుగుతున్నది.