లోకేష్ ప్రస్తావన.. బాబు కళ్లల్లో మెరుపు చూసి తీరాల్సిందే!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! 

సరిగ్గా సుమతీశతక కారుడు చెప్పినట్లుగా చంద్రబాబులో ఇప్పుడు పుత్రోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. నందమూరి బాలకృష్ణ టాక్ షో  అన్ స్టాపబుల్ సీజన్ 4 శుక్రవారం (అక్టోబర్ 25)న ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. తన అరెస్టు, జగన్ అరాచకపాలన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తన విజన్..  ఇలా అనేక అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు నాటి సంఘటనలను వివరిస్తున్నప్పుడు ఒకింత ఎమోషనల్ అయ్యారు. తప్పు చేయని తనను అరెస్టు చేయడమే కాకుండా ఆ సమయంలో తనను ట్రీట్ చేసిన విధానం కడుపు తరుక్కుపోయేలా చేసిందని చంద్రబాబు చెప్పారు.

ఇవన్నీ ఒకెత్తైతే.. తన కుమారుడు నారా లోకేష్ పాదయాత్ర గురించి బాలయ్య అడిగిన ప్రశ్నకు చంద్ర బాబు  సమాధానం ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన కళ్లలో ఆనందం, గర్వం ప్రస్ఫుటంగా కనిపించాయి. తన కుమారుడిగానో, ఎన్టీఆర్ మనవడిగానో, బాలయ్య మేనల్లుడిగానో కాకుండా తన కంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకత చాటుకోవాలని లోకేష్ భావించారనీ, అందుకే తాను వారించినా వినకుండా పాదయాత్ర చేశారని చంద్రబాబు చెప్పారు. తండ్రిగా తాను పాదయాత్ర వద్దనే చెప్పానన్నారు. ఒక విద్వేష పూరిత ప్రభుత్వం అధికారంలో ఉంది. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాదు అంతకు మించి ఏదైనా చేస్తారేమోనన్న భయం ఉంది. నేరుగా చెప్ప కున్నా పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ పై వైసీపీ మూకలు భౌతిక దాడులకు పాల్పడతాయన్న భయం ఉందని చంద్రబాబు పరోక్షంగా చెప్పారు. అయితే లోకేష్ సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారనీ, విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారని చంద్రబాబు చెప్పారు.  ఆయన చెప్పడమే కాదు.. రాష్ట్ర ప్రజానీకం నారా లోకేష్ లోని పరివర్తనలు చూశారు. ఆయన తనను తాను మేకోవర్ చేసుకున్న తీరును చూశారు.  పరిపూర్ణమైన రాజకీయనాయకుడిగా, ప్రజా నేతగా లోకేష్ సర్వామోదం పొందారు. 

అయితే లోకేష్ కు ఈ సర్వామోదం అంత తేలిగ్గా రాలేదు.   నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే  ఆయనను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు జీవితబీమా, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని చూశారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆయన వ్యక్తిత్వంపై దాడి చేయా లన్న కుట్రతో వ్యవహరించారు.  ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా వేటినీ వదలకుండా ఆయనను మానసికంగా కుంగదీయాలని చూశారు.  అయితే లోకేష్ కుంగిపోలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎగిశారు. ఎదిగారు.

ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తి తో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. యువగళంతో తానేమిటో నిరూపించుకున్నారు.పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగిం చారు. తండ్రికి తగ్గ తనయుడిగా కాదు..తండ్రిని మించిన తనయుడిగా జేజేలు అందుకుంటున్నారు.  అందుకే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో చంద్రబాబు తన తనయుడు లోకేష్ గురించి మాట్లాడుతూ గర్వంగా ఫీలయ్యారు. పుత్రోత్సాహం ఆయన కళ్లల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.