పార్లమెంటులో ‘జమిలి బిల్లు‘ ఎప్పుడంటే?

కేంద్రంలో కొలువుదీరి ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్  జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మోడీ రెండో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ జమిలి ఎన్నికల జపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత జమిలి ఎన్నికల నిర్వహణకు కార్యాచరణకు వేగవంతం చేశారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సమాయత్తమౌతున్నారు.   మూడోసారి ఎన్డీఏ  అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  తమ ఎజెండాలోని ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని,అందుకోసం పార్లమెంట్లో త్వరలో బిల్లు పెడతామని  బీజేపీ ఖరాఖండిగా చెబుతున్నది. ఇందుకు భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా కూడగట్టింది. లోక్ సభలో ఓకే.. అయితే ఈ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే అవసరమైన బలం సమకూర్చుకునేందుకు ఇప్పటి వరకూ ఆగింది. అయితే ఇప్పుడు రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ సర్కార్ కు అవసరమైన బలం చేకూరింది. మిత్రపక్షాల అంటే భాగస్వామ్య పక్షాల మద్దతుతో  సునాయాసంగా బిల్లులకు ఆమోదం పొందగలిగే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ప్రధానంగా ఒకేదేశం ఒకే ఎన్నిక అంటూ జమిలీ ఎన్నికల  నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల  పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కమిటీని నియమించింది.  ఆ కమిటీ పరిశీలన జరిపి ఇటీవల నివేదిక ఇచ్చింది.ఆ నివేదిక లో ఏమి ఉందో కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఊహించేయవచ్చు.  ఎందుకంటే ఆ కమిటీ నియమించిన ఉద్దేశమే జమిలి నిర్వహణ సాధ్యమే అన్న నివేదిక ఇచ్చేందుకు.  

జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి పార్లమెంట్,అసెంబ్లీలకు ఎన్నికలు జరపడం. ఇలా జరపాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఐదు ఆర్టికల్స్ 83,85,172,174,356 సవరణ చేయాలి. అలాగే లోక్ సభ,రాజ్యసభ లలో 67 శాతం సభ్యులు మద్దతు అవసరం.  అలాగే 14 రాష్ట్రాల అసెంబ్లీలలో జమిలికి మద్దతుగా తీర్మానాలు చేయాలి. అప్పుడే జమిలీ ఎన్నికలు సాధ్యమవుతాయి. మాటలమాంత్రికుడు మోదీ  ఈ టాస్క్ లో తప్పక విజయం  సాధిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. జమిలీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే  2027 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. సాధారణంగా ఎన్నికలు  విడిగా  జరిగితే ప్రజలు లోక్ సభకు జాతీయ పార్టీలవైపు  అసెంబ్లీ ఎన్నికలలో  ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపుతారు.  స్థానిక ప్రభుత్వాలయితే ఎక్కువ ప్రయోజనం పాటు స్థానిక నాయకత్వం పెరుగుతుందని ప్రజలు ఆలోచిస్తారు.

కాని బీజేపీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే  ప్రజలు తమవైపే చూస్తారని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. అంతే కాకుండా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో అధికారంలో ఉండటం బీజేపీకి గిట్టదు. ఆ విషయాన్ని పలు సందర్భాలలో బీజేపీ అగ్రనేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కూడా. ప్రాంతీయ పార్టీలు జాతీయ ప్రయోజనాలకు ఆటంకమన్నది బీజేపీ భావనగా కనిపిస్తోంది.   ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా  300 మార్క్ దాటలేకపోవడానికి కారణం కూడా ప్రాంతీయ పార్టీలేనన్నది బీజేపీ భావనగా ఉంది. అందేకే ఎలాగైనా  జమిలికి అనుకూలంగా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొంది..  జమిలితో సొంతంగా పూర్తి మేజార్టీ సాధించాలని ఆ పార్టీ ప్రణాళిక అన్నది పరిశీలకులు విశ్లేషణ.  అయితే బీజేపీ జమిలి వ్యూహం వెనుక శాశ్వతంగా అధికారాన్ని చేతుల్లో ఉంచుకునే కుట్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జమిలి ద్వారా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం వైపు బీజేపీ ప్రయాణం సాగుతుందని అంటున్నారు.

ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు.  ఏదిఏమైనా జమిలీ వల్ల ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం వాటిల్లడం మాత్రం తథ్యమన్నది రాజకీయ పరిశీలకులు భావన.  అంతే కాదు ఫెడరల్ వ్యవస్థగా ఉన్న పార్లమెంటరీ విధానం నెమ్మదిగా యూనిటరీ విధానంగా మారుతుందని విశ్లేషణలు చేస్తున్నారు.యూనిటరీ విధానంతో అధికారం కేంద్రీకృతమై  నిరంకుశత్వానికి దారితీసే ప్రమాదం లేకపోలేదంటున్నారు.  ఈ పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొవాలంటే ఇండియా కూటమి బలంగా రూపుదిద్దుకోవాలి.  అందుకు కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడాలి.  మొత్తం మీద జమిలి ఎన్నికలకు బీజేపీ తనదైన వ్యూహరచనతో మార్గం సుగమం చేసుకుంటుంటో.. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.