అమరావతి.. అడుగులు కాదు పరుగులు!
posted on Oct 18, 2024 10:56AM
గత ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా నవ్వుల పాలు కావడానికి కారణమైన జగన్ పాలన అంతం కావడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని ఠీవీగా నిలిచింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక ఏ అవరోధాలూ లేకుండా సజావుగా సాగి నిర్దుష్ట సమయానికి పూర్తి అవుతుందన్న విశ్వాసం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చి గత ఐదోళ్లుగా అన్ని రకాలుగానూ క్షేభను అనుభవించిన రైతుల తమ కష్టాలు కడతేరిపోయాయన్న ఆనందంలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన ప్రాధాన్యతలు పోలవరం, అమరావతి అని తన తొలి పర్యటనలకు వాటితోనే శ్రీకారం చుట్టడంతో తేటతెల్లం చేశారు.
అయితే జగన్ ఐదేళ్ల అధికారంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో రాజధాని ప్రాంతం అంతా ముళ్ల కంపలు, చెట్లతో ఒక అడవిలా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ఆరంభించి పూర్తి చేసింది.
జగన్ మూడు రాజధానుల డ్రామా కారణంగా అమరావతిపై కోర్టుల్లో విచారణ దశల్లో ఉన్న కేసుల ఉపసంహరణ దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని విస్పష్టంగా ప్రకటించడంతోనే వివాదాలన్నీ సమసిపోయినట్లైంది. అమరావతిపై వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్న దాదాపు 100 కు పైగా కేసుల ఉపసంహరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటిలో రైతులు వేసిన కేసుల ఉపసంహరణకు వారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడంపై రైతులు వేసిన కేసును ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం అని ప్రకటించడంతో ఆ కేసు ఉపసంహరణకు రైతులు నిర్ణయం తీసుకున్నారు.
గత ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంలో మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఇక ఎంత మాత్రం రాజధాని లేని రాష్ట్రం కాదు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. ప్రపంచం చూపు ఇప్పుడు అమరావతిపైనే ఉంది. కేంద్ర సంస్థలు తరలివస్తున్నాయి. పెట్టుబడులు వెల్లువె త్తుతున్నాయి. ఇక కేంద్రం నుంచి అమరావతి నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం ఉంటుందన్న స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పురోగతిపై ఆసక్తి, హర్షం వ్యక్తం అవుతున్నాయి.
అయినప్పటికీ రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు ఆగడం లేదు. అసత్య ప్రచారాలతో అమరావతిపై ప్రజలలో అనుమానాలు రేకెత్తించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల సమయంలో అమరావతి మునిగిపోయిందంటూ అవాస్తవాల ప్రచారానికి తెరలేపింది. హైకోర్టు మునిగిపోయిందంటూ ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చంద్రబాబు నివాసాన్ని కాపాడుకోవడానికి బుడమేరు గేట్లెత్తేసి సింగ్ నగర్ ను మంచేశారంటూ అభూత కల్పనలనుర ప్రచారం చేసింది. హైకోర్టు, సచివాలయం పూర్తిగా మునిగిపోయాయనీ వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెట్టేసింది. అయితే వాస్తవాలు కళ్లకు కడుతుండటంతో వైసీపీ ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మలేదు. అన్ని అవాంతరాలు, కుట్రలు, కుతంత్రాలను తట్టుకుని అమరావతి ఠీవీగా నిలబడింది. ఇక ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ పూర్తి కావడం, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు విడుదల కావడంతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టనుంది.