అవినీతిపై చర్చకు నేను సిద్ధం..కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా?

ఏఐసీసీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి  గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో తెరాస పాలనలో పట్టపగలే రాష్ట్ర సంపద దోపిడీకి గురవుతోందని, ఇదంతా కేసీఆర్‌ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు.తెలంగాణలో గుత్తేదారులు లేనట్లు..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలకు రూ.వేల కోట్ల పనులు కట్టబెట్టడం నిజం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులకు సంబంధించి ఏకంగా రూ.77 వేల కోట్ల పనులను ఆ కంపెనీలకే అప్పగించారని, ఉద్దేశ పూర్వకంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని మూడింతలు పెంచారని విమర్శించారు. ఈ తరహాలో పనులను అప్పగించడం దేశంలో ఎక్కడా చూడలేదని, భవిష్యత్తులోనూ చూడబోమని వ్యాఖ్యానించారు. ‘‘ప్రాజెక్టుల వాస్తవ వ్యయం కంటే దాదాపు 30 శాతం అంచనాలు పెంచి ఖర్చు చేశారు. అందులో కేసీఆర్‌ 6 శాతం కమీషన్‌ తీసుకోవడంతోపాటు..మంత్రులకు, తన కుటుంబ సభ్యులకు, భజనపరులకు ఎంత శాతం కమీషన్‌ ఇవ్వాలో కూడా ఆయనే నిర్ణయించారు’’ అని ఆరోపించారు. రూ.వేల కోట్లు ఖర్చయినా గ్రామాలకు పైపులు వచ్చాయి తప్ప నీళ్లు రాలేదని, ఎకరా భూమికి సాగునీరు పారలేదన్నారు. ‘‘కేసీఆర్‌ ఏ పని చేసినా ధైర్యంగా చేస్తాడు. ఆయన నిజాయితీ పరుడయితే  నేను చెప్పిన లెక్కలు తప్పని నిరూపించాలి’’ అని సవాల్‌ విసిరారు.

 

 

తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన జైపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అవినీతికి అలవాటు పడిన కాంగ్రెస్‌ నేతలకు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.‘కేంద్రమంత్రిగా ఉండి జైపాల్‌రెడ్డి పాలమూరు జిల్లాకు చేసింది శూన్యం. ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడితే ప్రజలు నవ్వుతారు.కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన జలయజ్ఞం.. ధనయజ్ఞంగా మారిందని చంద్రబాబునాయుడు సహా అందరూ విమర్శించినోళ్లే. మిషన్‌ భగీరథ పథకం కింద రాష్ట్రంలో 15వేల గ్రామాల ప్రజలకు నీరందిస్తున్నాం. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు తెలుసుకోవాలి. ఆంధ్రా కంపెనీలను పెంచి పోషించింది కాంగ్రెస్‌ నేతలు కాదా?. జైపాల్‌రెడ్డి పుట్టి పెరిగిన కల్వకుర్తి నియోజకవర్గానికి తెరాస ప్రభుత్వం వచ్చాకే నీరందించాం. మేం అధికారంలోకి వచ్చాక 25లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. ముఖ్యమంత్రి రేసులో తాను కూడా ఉన్నాను అని చెప్పుకునేందుకే జైపాల్‌రెడ్డి.. తెరాస ప్రభుత్వం, కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం ఉన్న ఈపీఎస్‌ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే. ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చించేందుకు నేను సిద్ధం.. కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా?’ అని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.