జగన్ నోట ఓటమి మాట.. భవిష్యత్ దర్శనమేనా?

జగన్ నోట ఓటమి  మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు. మచిలీపట్నంలో ఎన్నికల ర్యాలీలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఓటమి భయానికి నిదర్శనంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. సాధారణంగా అన్ని విధాలుగా ఓటమి తథ్యం అన్న నిర్ధారణకు వచ్చిన తరువాతే రాజకీయ నాయకుల నుంచి ఇటువంటి బలహీనమైన వ్యాఖ్యలు చేస్తారని వివరిస్తున్నారు. జగన్ కూడా ఓటమి భయంతో, బెంగతో, బాధతోనే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటనలను వారు గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికలలో చంద్రబాబు అప్పటి ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.  ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. 

ఇప్పుడు ఐదేళ్ల తరువాత జగన్ వ్యాఖ్యలు, ప్రకటనలూ చూస్తుంటే జగన్ తన ఓటమిని పోలింగ్ కు ముందే అంగీకరించేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు.  2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తరువాత జగన్ ఇంత బేలగా మాట్లాడటం ఇదే మొదటి సారి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలైన తరువాత కూడా ఆ పరాజయంపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జలే మాట్లాడారు. తమ ఓటర్లు వేరు ఉన్నారని చెప్పారు.  

అయితే ఇప్పుడు మాత్రం ఓ ఎన్నికల ర్యాలీలో ఓటమి భయంతో జగన్ మాట్లాడటం చూస్తుంటే ప్రజా వ్యతిరేకతతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని స్పష్టంగా అర్ధమైతోందని పరిశీలకులు అంటున్నారు.  విపక్ష తెలుగుదేశం మేనిఫెస్టోకు ప్రజల నుంచి అద్భుత స్పందన రావడం, అదే సమయంలో తాను విడుదల చేసిన మేనిఫెస్టోను జనం అసలు పట్టించుకోకపోవడం, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో విపక్షాలు సహేతుకంగా చేస్తున్న విమర్శలు జగన్ లో ఓటమి భయాన్ని కలిగించాయని విశ్లేషిస్తున్నారు.

వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం విపక్షాల విమర్శలపై నిర్హేతుకంగా స్పందించి చర్యలు తీసుకోవడం లేదు. పించన్ల పంపిణీ విషయంలో  ఘోరంగా విఫలమైనా సీఎస్ జవహర్ రెడ్డిని ఇప్పటికీ మార్చలేదు. ఆయన జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి విపక్ష కూటమి నేతలు ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు.

నాడు అంటే 2019 ఎన్నికల సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఇలా ఫిర్యాదు చేయగానే అలా అప్పటి సీఎస్ పునేఠాను తప్పించేసింది. అదే ఎన్నికల సంఘం ఇప్పుడు  ప్రధాని చిలకలూరి పేట సభలో భద్రతా లోపాలు తలెత్తినా డీజపీని వెంటనే మార్చేయలేదు.  ఎన్నికలు వారం రోజులలోకి వచ్చిన తరువాత మాత్రమే తాపీగా డీజీని మార్చి కొత్త డీజీపీని నియమించింది.  అంతే కాదు జగన్ అప్పాయింట్ చేసిన ఇంటెలిజెన్స్ చీఫ్, సీఐడీ చీఫ్ లను ఇప్పటికీ మార్చ లేదు.

అయితే 2019 ఎన్నికలకు ముందు మాత్రం అప్పటి విపక్ష నేత జగన్ ఇలా కోరడం తరువాయి అలా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక అధికారులందరినీ మార్చేసిన ఎన్నికల సంఘం అన్ని విధాలుగా చంద్రబాబును ఇబ్బందులకు గురి చేసింది.  నాటి పరిస్థితితో పోల్చుకుంటే జగన్ కు ఎన్నికల సంఘం ఇప్పటికీ సానుకూలంగా వ్యవహరిస్తోందనే చెప్పాలి. కానీ ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేయడం, కొందరు అధికారులను మార్చడంతోనే జగన్ వణికిపోతున్నారు. ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ కు గురౌతున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగే అవకాశం లేదని భయమేస్తోందంటున్నారు. పోలింగ్ కు ముందే ఓటమి ఖరారైపోయిందన్నట్లగా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ కు భవిష్యత్ దర్శనం అయిపోయిందా? అన్న అనుమానం కలుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఏది ఏమైనా పార్టీ అధినేతే ఎన్నికల విజయం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో వైసీపీ శ్రేణులు మరింత డీలా పడటం ఖాయమని అంటున్నారు.