ఉత్తరాంధ్రలో వైసీపీకి ఘోర పరాభవం తప్పదా?

ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ ప్రాంతంలోని మూడు జిల్లాలలోనూ వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖలో అయితే ఆ పార్టీకి  ఘోర పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ రాజధాని అంటూ ఆర్భాటం చేసిన వైసీపీ ఆ దిశగా ఒక్క అడుగూ వేయలేకపోవడం, పర్యావరణ ముప్పును కూడా లేక్క చేయకుండా రుషికొండకు బోడిగుండు కొట్టి మరీ భవన నిర్మాణాలు చేపట్టడం ప్రజలలో అధికార పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవడానికి కారణమయ్యాయని అంటున్నారు.

జిల్లాకు సంబంధించిన కీలక సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోకపోవడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడితేవడంలో విఫలం కావడం ఇవన్నీ వెరసి వైసీపీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. విజయనగరం జిల్లా నుంచి  మంత్రి బొత్సా సతీమణి బొత్స ఝాన్సీరాణిని విశాఖ ఎంపీగా పోటీలో దింపడమే.. విశాఖలో ఆ పార్టీ పరిస్థితికి అద్దంపడుతోందని చెబుతున్నారు. 

గత ఎన్నికలలో అంటే 2019లో విశాఖ లో  నాలుగు అసెంబ్లీ స్థానాలలోనూ తెలుగుదేశం విజయం సాధించింది. అయితే విశాఖ లోక్ సభ స్థానంలో పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అన్ని అసెంబ్లీ స్థానాలనూ గెలుచుకోవడమే కాకుండా విశాఖ లోక్ సభ స్థానంలో కూడా తెలుగుదేశం జయకేతనం ఎగురవేసే పరిస్థితులున్నాయని స్థానిక ప్రజల మూడ్ ను బట్టి అవగతమౌతోంది. విశాఖ జిల్లాలో ప్రచారం తీరు చూస్తుంటే అసలు వైసీపీ పోటీలో ఉందా అన్న అనుమానం కలుగుతోందని స్థానికులు అంటున్నారు. ఇదే పరిస్థితి ఉత్తరాంధ్రమూడు జిల్లాల్లోనూ కనిపిస్తోందంటున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ పట్నం వరకూ ప్రతి నియోజజకర్గంలోనూ కూడా వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో పూర్తిగా విఫలమౌతున్నారు. స్థానిక సమస్యలపై జనం వైసీపీ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సమస్యలపై ప్రజల ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న పరిస్థితి గోచరిస్తోంది.

సమస్యల పరిష్కారంపై జవాబు చెప్పలేని వైసీపీ అభ్యర్థులు చేసే కొత్త వాగ్దానాలను జనం నమ్మడం లేదు. దీంతో ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రచారంలో వెనుకబడింది. మూడు జిల్లాల్లోనూ కూడా వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.