ఐప్యాక్ ఆఫీసుకి జగన్.. మతలబేంటి?

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ తనకు సహకారం అందిస్తున్న ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి వెళ్ళే ఛాన్సే లేదు. ఓటమి కన్ఫమ్ అయిన బాధ ఒక వైపు, యూరప్ వెళ్ళడానికి తట్టాబుట్టా సర్దుకునే బిజీ మరో వైపు. అయినప్పటికీ, జగన్ తీరిక చేసుకుని మరీ ఐప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయానికి ఎందుకు వెళ్ళారా అనే సందేహాలు కలగటం సహజం.

విజయవాడలో వున్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్ళడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనధికార పర్యటన అయినప్పటికీ, అన్ని రకాల అధికారిక ఖర్చులతో ఆయన అక్కడకి వెళ్ళారు. ఐప్యాక్ కార్యాలయంలో జగన్ రాకకోసం ఎదురుచూస్తున్న వందలాది మంది ఐప్యాక్ ఉద్యోగులు జగన్‌ని చూసి ఉత్సాహంతో ఉరకలు వేశారు. షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. సెల్ఫీలు దిగారు. అన్నికంటే వింత ఏమిటంలే, జగనే స్వయంగా ఒక సెల్ఫీ క్లిక్ చేశారు. తర్వాత ఐ ప్యాక్ సభ్యులు మీరు మళ్ళీ ఘన విజయం సాధిస్తారు అని ముక్తకంఠంతో అరిచారు. జగన్ కూడా, అంతకు ముందుకంటే భారీ విజయం సాధిస్తాను అని చెప్పారు. అది విని అందరూ ఆనందంగా చప్పట్లు చరిచారు... సీఎం.. సీఎం అని అరిచారు.. ఈ ప్రహసనం అయిపోగానే జగన్ తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కి చేరుకున్నారు.

అసలింతకీ జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకంటే, గత ఎన్నికల తర్వాత జగన్ ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళారు. వాళ్ళకి థాంక్స్ చెప్పారు. ఇప్పుడు వెళ్ళాలన్న ఉద్దేశం లేకపోయినా, వెళ్ళక తప్పని పరిస్థితి.. ఎందుకంటే, ఇప్పటికే జగన్ ప్రభుత్వం చాపచుట్టేసినట్టే అనే పాయింట్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు కనుక జగన్ గత ఎన్నికల తరహాలో కాకుండా, ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్ళకుండా ఊరుకుంటే, జగన్ కూడా చేతులు ఎత్తేశాడనే మెసేజ్ వెళ్ళే అవకాశం వుంది కాబట్టి ఆయనకి వెళ్ళక తప్పలేదు.

ఐపాక్‌తో గత ఎన్నికల వరకు అనుబంధం వున్న ప్రశాంత్ కిషోర్ దానిని కొంతకాలం క్రితం తెంచుకున్నారు. ఈమధ్య జర్నలిస్టు రవిప్రకాష్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌ని ప్రశాంత్ కిషోర్ భారీగా విమర్శించారు. చేసిన మేలును మరచిపోవడం కంటే పెద్ద పాపం మరొకటి వుండదని భగవద్గీతలో చెప్పారని, జగన్ తాను చేసిన మేలును మరచిపోయారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ నేపథ్యంలో, ఐప్యాక్ సంస్థకి వెళ్లి మరీ థాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి జగన్‌ది. ఒకవేళ జగన్ వెళ్ళకపోతే, చూశారా.. జగన్ ఈసారి ఐప్యాక్ ఆఫీసుకు వెళ్ళలేదు. జగన్‌కి కృతజ్ఞత లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాట నిజమే అనే లోకనింద వస్తుందని భయపడి జగన్ ఆ సంస్థ కార్యాలయానికి వెళ్ళారు. ఓ పనైపోయింది బాబూ అనిపించుకున్నారు.